అత్యున్నత స్థాయిలో నేతల అవినీతిపై విచారణ జరిపే అధికారం ఉన్న ‘లోక్‌పాల్’ వ్యవస్థ ఏర్పాటై ఎనిమిది నెలలు అవుతుంది. ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికి లోక్‌పాల్ వద్దకు 1160 కేసులు వచ్చాయి. అయితే అందులో ఒక్క దాంట్లో కూడా పూర్తి స్థాయి విచారణ ప్రారంభించలేదు సదరు సంస్థ. అయితే లోక్‌పాల్ ఆఫీసు అద్దె కోసం మాత్రం రూ.3.85 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం.
సమాచార హక్కు చట్టం కింద శుభం ఖత్రి(18) అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆర్టీఐ సమాధానం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పి.సి.ఘోష్ నియమితులయ్యారు. ఆయనతో పాటు లోక్‌పాల్ కమిటీలో 8 మంది సభ్యులుంటారు. వారి కార్యకలాపాల కోసం ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ అశోకాలో 12 గదులను తాత్కాలిక కార్యాలయంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఇందుకోసం నెలకు రూ. 50లక్షలను ప్రభుత్వం హోటల్ అశోకాకు కడుతూ వస్తుంది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ (డిఓపిటి) నిర్ణయించిన అద్దె ప్రకారం లోక్‌పాల్ ప్రభుత్వ యాజమాన్యంలోని హోటల్‌కు అక్టోబర్ 31 వరకు 3.85 కోట్ల అద్దె చెల్లించింది. అది ఇప్పటికీ వారి కార్యాలయంగా కొనసాగుతోంది.
మరో విషయమేంటంటే లోక్‌పాల్‌కు చేయాల్సిన ఫిర్యాదుల కు సంబంధించి ఇంతవరకూ అధికారిక ఫార్మాట్ ఏమీ లేదని ఆర్టీఐ సమాధానంలో వెల్లడించింది. ఇక పని జరగకుండా అద్దె భారీగా కడుతుండడంపై ప్రభుత్వంపై కాంగ్రెస్ సీరియస్ అవుతుంది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది.