Electric Scooter : బాబోయ్ ఈ-బైక్..! ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా తగ్గిన డిమాండ్

నిన్నటివరకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ నేడు లేదు. ఈ బైక్ లను కొనేందుకు ఆసక్తి చూపిన వాళ్లు ఇప్పుడు సడెన్ గా టర్న్ తీసుకున్నారు. దీంతో ఈవీ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

Electric Scooter : బాబోయ్ ఈ-బైక్..! ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా తగ్గిన డిమాండ్

Updated On : August 23, 2022 / 11:05 PM IST

Electric Scooter : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి పెరుగుతూనే పోతున్నాయి. మండిపోతున్న ఇంధన ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరల పోటుని తట్టుకోలేక వాహనదారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. సరిగ్గా అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. పెట్రోల్ తో పని లేదు, డీజిల్ తో అవసరం లేదు.. పైగా ధరల పోటు లేదు. దీంతో అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపారు. ఒక్కసారి ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగిపోయింది. అంతా ఈ-బైక్ లను కొనేందుకు ఆసక్తిచూపారు.

కట్ చేస్తే.. ఇది గతం అని చెప్పాలి. నిన్నటివరకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ నేడు లేదు. ఈ బైక్ లను కొనేందుకు ఆసక్తి చూపిన వాళ్లు ఇప్పుడు సడెన్ గా టర్న్ తీసుకున్నారు. ఈ-బైక్ అంటేనే అమ్మో వద్దు.. అనే పరిస్థితి వచ్చింది. దీంతో ఈవీ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతా ప్రమాణాల్లో లోపాలు తలెత్తాయి. తరుచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ బైక్ లు బాంబుల్లా పేలుతున్నాయి. మంటల్లో కాలిపోతున్నాయి. ఈ బైక్ లు పలువురి ప్రాణాలను కూడా బలి తీసుకున్నాయి. ముఖ్యంగా బ్యాటరీలో లోపాల వల్లే అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు నివేదికలో తేలింది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాద ఘటనల సంఖ్య పెరగడంతో వాహనదారుల్లో భయం పట్టుకుంది. ఎందుకొచ్చిన రిస్క్ అనుకున్నారో ఏమో.. ఎలక్ట్రిక్ వాహనాల జోలికి వెళ్లడం మానేశారు.

ఫలితంగా ప్రస్తుతం ఈవీ కొనేందుకు సిద్ధంగా ఉన్న వారి సంఖ్య కేవలం 1 శాతంగానే ఉందట. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కాగా, ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారి సంఖ్య గతేడాది మార్చిలో 17శాతం ఉండగా, ఆగస్టులో 2శాతంగా ఉంది.

ఈ ఏడాది మార్చి ఏప్రిల్ మధ్య కాలంలో 24కి పైగానే ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీలకు కేంద్రం ఏప్రిల్ 21 కీలక సూచన చేసింది. ముందుజాగ్రత్తగా అన్ని లోపభూయిష్ట బ్యాచ్‌ల వాహనాలను వెంటనే రీకాల్ చేయాలని లేదా భారీ జరిమానాను ఎదుర్కోవాలని EV తయారీదారులను హెచ్చరించింది. ఆ వెంటనే 7వేల ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు రీకాల్ చేశాయి.

అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల కోసం వివరణాత్మక పరిశోధన మరియు ‘నాణ్యత-కేంద్రీకృత’ మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రభుత్వం అగ్ని, పేలుడు మరియు పర్యావరణ భద్రత (CFEES) మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.