‘సఖీ’ పోలింగ్ కేంద్రాలు: మహిళా ఓటర్ల కోసం

చంఢీఘడ్ : ప్రాంతం ఏదైనా..మహిళా ఓటర్లే కీలకంగా మారారు. మహిళల ఓట్లతోనే ఏ నాయకుడైనా అధికారాన్ని దక్కించుకునేది. ఎన్నికల్లో మహిళా ఓటర్లు అంత్యం కీలకంగా మారిన సందర్భంగా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది ఎన్నికల కమిషన్.
హర్యానా రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా ఓటర్ల కోసం మహిళలే పోలింగ్ అధికారులుగా ‘సఖీ’ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామని హర్యానా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ రంజన్ తెలిపారు. మహిళా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చి వారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ సఖీ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశఆమని రాజీవ్ రంజన్ తెలిపారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాదు గర్భిణులు, మూడేళ్ల లోపు వయసు గల పిల్లలున్న మహిళల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 15 మంది కంటే అధికంగా మహిళలు క్యూలో నిలబడి ఉంటే ఒక పురుషుడి తర్వాత ఇద్దరు మహిళలను ఓటు వేసేలా చూస్తామన్నారు. మహిళల్లో ఓటు వేయాలనే అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా రంగోలీ, మెహందీ పోటీలు కూడా నిర్వహించి ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యాన్ని మహిళలకు వివరించి చెపుతున్నామని రాజీవ్ రంజన్ తెలిపారు.