హింట్ ఇచ్చేశారు : మీరు ఊహించని విధంగా పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి

ఆయిల్ ధరలు ఊహించని విధంగా విపరీతంగా పెరిగిపోయే అవకాశముందంటూ సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచానికి హెచ్చరికలు చేశారు. ప్రపంచదేశాలు కలిసికట్టుగా ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే.. ఆయిల్ ధరలు ఆకాశాన్నితాకుతాయని స్వయంగా చెప్పటం సంచలనంగా మారింది. సౌదీ ప్రభుత్వానికి చెందిన రెండు అతిపెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ పై సెప్టెంబర్ 14న జరిగిన డ్రోన్ దాడికి ఇరాన్ కారణమని బిన్ సల్మాన్ ఆరోపించారు. ఈ దాడి కారణంగానే ఆయిల్ ఉత్పత్తి సగానికి తగ్గిందని, చమురు ధరలు పెరిగాయని అన్నారు. ఇరాన్‌ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు.. బలమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ప్రపంచ ప్రయోజనాలను బెదిరించే మరిన్ని తీవ్రతలను చూస్తామని సిబిఎస్ టీవీ ప్రోగ్రాం… 60 మినిట్స్‌లో సౌదీ రాజు సల్మాన్ వెల్లడించటం అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది.
ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే చమురు సరఫరా అంతరాయం కలగడం, చమురు ధరలు మన జీవితకాలంలో చూడని విధంగా ధరలు ఆకాశాన్ని తాకుతాయని హెచ్చరించారు సౌదీ రాజు. సైనిక చర్య కన్నా.. ఇరాన్ తో రాజకీయ పరిష్కారాన్ని ఇష్టపడతానని సల్మాన్ వెల్లడించటం విశేషం. సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. అయితే సౌదీ రాజు సల్మాన్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేయలేదని అంటోంది.
సౌదీ – ఇరాన్ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా.. పెట్రోల్ రేట్లు ఊహించని విధంగా పెరుగుతాయని చెప్పటం ప్రపంచదేశాలను భయపెడుతోంది. పెట్రోల్ రేట్లు ఇదే విధంగా పెరిగితే ఆ రాజు చెప్పినట్లు లీటర్ పెట్రోల్ 150 రూపాయలు అవుతుందా ఏంటీ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.