సాఫీగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ….కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసిన సీరం,భారత్ బయోటెక్

Serum Institute, Bharat Biotech pledge కరోనా వ్యాక్సిన్ అంశంపై పుణెలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సీరం సీఈవో ఆదర్ పూనావాలా, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం(జనవరి-5,2021) మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. తమ రెండు కంపెనీలు దేశం కోసం, ప్రపంచ ప్రజల హితం కోసం పనిచేస్తున్నాయని ఇద్దరూ తమ ప్రకటనలో స్పష్టం చేశారు.
కాగా, ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవీషీల్డ్ టీకాను సీరం సంస్థ భారత్ లో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఈ టీకా అత్యవసర వినియోగానికి ఆదివారం డీజీసీఐ అనుమతిచ్చింది. అలాగే, భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, దీని పట్ల అభ్యంతరం వ్యక్తం అయ్యింది. మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే.. కోవాగ్జిన్‌కు ఎలా అనుమతి ఇచ్చారని విమర్శలు వచ్చాయి. కోవాగ్జిన్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపడంపై నిన్న భారత్ బయోటెక్ తీవ్రంగా స్పందించింది. అయితే.. ఇవాళ అనుమతి పొందిన రెండు కంపెనీలు సీరం, భారత్ బయోటెక్ సంస్థ ఓనర్లు ఇవాళ సంయుక్త ప్రకటన విడుదల చేయడం విశేషం.
దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ల పంపిణీకి కలిసి పనిచేయనున్నట్లు ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో సీరం,భారత్ బయోటెక్ అధినేతలు స్పష్టం చేశారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే తమ రెండు కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధి పనులు కొనసాగించనున్నట్లు తెలిపారు. టీకాల అవసరంపై తమకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నట్లు ఇరువురూ వెల్లడించారు. భారత్ లాంటి దేశాలకు టీకా ప్రాముఖ్యత చాలా కీలమైందన్నారు. ఇండియాలో రెండు టీకాలకు ఎమర్జెన్సీ వినియోగం కోసం ఆమోదం దక్కిందని, ఇప్పుడు తమ దృష్టి మొత్తం ఉత్పత్తి, సరఫరా, పంపిణీపైనే ఉన్నట్లు సీరం, బయోటెక్ ఓనర్లు తెలిపారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ల పంపిణీకి కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించాయి.
కోవిడ్19 వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా సాఫీగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇద్దరూ సంయుక్త వాగ్ధానం చేశారు. కోవిడ్ వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయని, భారత్‌తో పాటు ఇతర దేశాల ప్రజలను రక్షించాలన్న ఉద్దేశంతోనే టీకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆదార్ పూనావాలా, కృష్ణ ఎల్లా తెలిపారు. టీకాలు అవసరమైన వారికి సమర్థవంతమైన, సురక్షితమైన వాటిని అందిస్తామన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు అత్యంత కీలకమైనవని, ప్రాణాలను కాపాడడమే కాదు, ఆ టీకాలతో మళ్లీ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడుతాయని తమ ప్రకటనలో వారు అభిప్రాయపడ్డారు.
మరోవైపు, భారత వ్యాక్సిన్ తయారీ సామర్థ్యంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. భారత్ పనితీరును వారు కొనియాడారు. భారత ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటోందని, మహమ్మారిని అంతం చేసేందుకు ఆ దేశం కట్టుబడి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ తన ట్వీట్‌లో తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేస్తున్న భారత్.. వ్యాక్సినేషన్ ప్రక్రియతో దేశ ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే, సురక్షితమైన సమర్థవంతమైన వ్యాక్సిన్లను అవసరమైన వారికి ఇవ్వవచ్చు అని టెడ్రోస్ తెలిపారు. ప్రధాని మోదీకి తన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిగ్ గేట్స్ కూడా భారత ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రక్రియను మెచ్చుకున్నారు. శాస్త్రీయ ఆవిష్కరణల్లో భారత నాయకత్వం అద్భుతంగా ఉందన్నారు. భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Important Announcement: Joint statement @BharatBiotech and @SerumInstIndia pic.twitter.com/la5av27Mqy
— SerumInstituteIndia (@SerumInstIndia) January 5, 2021