Sharad Pawar: 2019 సీన్ రిపీట్.. మరోసారి వర్షంలో తడుస్తూనే ప్రసంగించిన శరద్ పవార్

సభలోని వారు ఆయనకు గొడుకు ఇవ్వబోగా దాన్ని ఆయన తిరస్కరించి వర్షంలోనే ప్రసంగించారు. తమ విజయాన్ని వర్షం రూపంలో కురిపిస్తోందని ఆ సందర్భంలో శరద్ పవార్ అన్నారు

Sharad Pawar: 2019 సీన్ రిపీట్.. మరోసారి వర్షంలో తడుస్తూనే ప్రసంగించిన శరద్ పవార్

Updated On : November 27, 2023 / 8:42 PM IST

2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వర్షంలో తడుస్తూ శరద్ పవార్ చేసిన ప్రసంగం అప్పట్లో ఎన్సీపీని విజయ తీరాలకు తీసుకెళ్లిందని అంటుంటారు. ఆ సీన్ మరోసారి రిపీట్ అయిందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. సోమవారం నవీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పవార్ మరోసారి వర్షంలో తడుస్తూ ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రసంగం ప్రారంభించగానే చిరు జల్లు ప్రారంభమైంది. అయితే ఆ జల్లుల్లోనే పవార్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

‘‘మన ప్రణాళికలను ఈ వర్షం దెబ్బతీసి ఉండవచ్చు. కానీ మనం ఇలాంటి వాటికి ఎంత మాత్రం వెనకడుగు వేసేది లేదు. పరిస్థితి ఎలాంటిదైనా మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని పవార్ అన్నారు. తన అన్న కుమారుడు అజిత్ పవార్ పార్టీని చీల్చి 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే ఈయన పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా శరద్ పవార్ విమర్శలు గుప్పించారు.


ఇక గతంలోని సందర్భం విషయానికి వస్తే.. 18 అక్టోబర్ 2019న మహారాష్ట్రలోని సతారా లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పవార్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే వర్షం మొదలైంది. అయితే సభలోని వారు ఆయనకు గొడుకు ఇవ్వబోగా దాన్ని ఆయన తిరస్కరించి వర్షంలోనే ప్రసంగించారు. తమ విజయాన్ని వర్షం రూపంలో కురిపిస్తోందని ఆ సందర్భంలో శరద్ పవార్ అన్నారు. అదే సందర్భంలో రాష్ట్రంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. అయితే ఎన్సీపీ విజయానికి ఆ సందర్భమే పెద్ద మలుపు అని అంటుంటారు.