మేనేజర్‌కు క్రికెట్ పిచ్చి.. అదే ఈ అమ్మాయి ప్రాణం మీదకు తెచ్చిందా? పెరయిల్ తండ్రి ఏమన్నారు?
దురదృష్టవశాత్తూ జులై 21న ఆమె తన రూమ్‌లో పడిపోయిందని..

పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై)లో సీఏగా పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ పెరయిల్ (26) పనిఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కేరళ యువతి అన్నా సెబాస్టియన్ పెరయిల్ 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరి, అధిక గంటలు పనిచేసి తీవ్ర ఒత్తిడికి గురైందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెరయల్ పనిచేస్తున్న సంస్థ మేనేజర్‌కు క్రికెట్ పిచ్చి కూడా ఉందని, క్రికెట్ చూస్తూ కూర్చొని పనిని ఇతర సమయంలో చేసేవారని ఆ ఉద్యోగిని తండ్రి చెప్పారు.
తాజాగా, దీనిపై ఆ యువతి తండ్రి సీబీ జోసెఫ్ మాట్లాడుతూ.. తన కూతురు పనిని షెడ్యూల్ సమయంలోనే చేసినప్పటికీ ఆమె మేనేజర్ ఆ పనిని సరైన సమయంలో రివ్యూ చేయలేదని అన్నారు. ఆ మేనేజర్ క్రికెట్ అభిమాని అని, క్రికెట్ మ్యాచును చూసేందుకు అందుకు తగ్గట్లుగా ఆయన తన షెడ్యూల్‌ను మార్చుకునే వారని చెప్పారు. దీంతో ఆమెకు అప్పగించిన పనిని రాత్రి వరకు కూర్చొని చేయాల్సి వచ్చేదని తెలిపారు.
తన కూతురు ఈ ఏడాది మార్చి 18నే ఆ కంపెనీలో చేరిందని అన్నారు. వారం రోజుల తర్వాత ఆమె రెగ్యులర్ ఆడిటింగ్‌ను ప్రారంభించిందని, ఆ కంపెనీలో 6 ఆడిట్ టీమ్‌లు ఉన్నాయని చెప్పారు. తన కూతురిని 6వ జట్టులో చేర్చారని, అధిక పని అప్పజెప్పారని తెలిపారు.
తన కూతురు అర్ధరాత్రి సమయంలోనూ పనిచేయాల్సి వచ్చిందని చెప్పారు. తిరిగి ఆమె రూమ్‌కు చేరుకున్న తర్వాత కూడా ఆమె తన పనితో సంబంధం లేని అదనపు పనిని చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆమెకు నిద్రపోవడానికి, తినడానికి కూడా సమయం లేదని అన్నారు. ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా పడిందని తెలిపారు.
అంత ఒత్తిడి మధ్య తాను పనిచేయలేకపోతున్నానని, ఆమె ఫోను చేసి ఏడుస్తూ చెప్పేదని అన్నారు. రాజీనామా చేసి రావాలని తాము చెప్పేవాళ్లమని, అందుకు ఆమె ఒప్పుకోలేదని తెలిపారు. దురదృష్టవశాత్తూ జులై 21న ఆమె తన రూమ్‌లో పడిపోయిందని, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిందని చెప్పారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి తమను పరామర్శించారని, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారని తెలిపారు.