మ‌హాకుంభ‌మేళాలో తొక్కిస‌లాట.. పలువురు భక్తులు మృతి.. సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్

కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు.

మ‌హాకుంభ‌మేళాలో తొక్కిస‌లాట.. పలువురు భక్తులు మృతి.. సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్

Stampede at Maha Kumbh

Updated On : January 29, 2025 / 7:13 AM IST

Maha Kumbh 2025: మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఈ అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా.. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో 15మంది భక్తులు మృతిచెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న ప్రధాని.. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పుణ్యస్నానాల వద్ద భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు తెలిసింది.

 


ఈ ఘటనపై కుంభమేళాలో స్పెషల్ డ్యూటీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. బుధవారం తెల్లవారుజామున గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమం ప్రాంతమైన సంగం వద్ద బారికేడ్లు విరిగిపడటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రమాదంలో కొంతమంది గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్సుల ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనలో 40 మంది వరకు గాయపడినట్లు తెలిసింది. వీరిలో 15మంది మృతిచెందగా.. కొందరు తీవ్ర గాయాలతో, కొందరు స్వల్ప గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

మహాకుంభ మేళాలో మౌనీ అమావాస్యకు ప్రత్యేకత ఉంది. ఈరోజు గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యంగా భక్తులు భావిస్తారు. దీంతో బుధవారం ఒక్కరోజే కుంభమేళాలో పుణ్యస్నానాలకోసం 10కోట్లకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉంటే.. జనవరి 13 నుంచి కుంభమేళా ప్రారంభంకాగా.. ఇప్పటి వరకు 15కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.