Supreme Court: ఈశా ఫౌండేషన్‌కు ఊరట.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు

ఈశా ఫౌండేషన్ పై ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని పోలీసులకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

Supreme Court: ఈశా ఫౌండేషన్‌కు ఊరట.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Supreme Court

Updated On : October 3, 2024 / 1:22 PM IST

Sadhguru Isha Foundation: ఈశా ఫౌండేషన్ పై ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని పోలీసులకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసును గురువారం సుప్రీంకోర్టు విచారించింది. తాము దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని ఈశా ఫౌండేషన్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఫౌండేషన్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అలాగే ఆ స్టేటస్ రిపోర్టు వివరాలను తమకు సమర్పించాలని వెల్లడించింది. ఇక ఈ వ్యవహారంపై ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ ను హైకోర్టు నుంచి సుప్రీం ధర్మాసనం ముందుకు బదిలీ చేసింది.

Also Read : Kishan Reddy: కొండా సురేఖ వివాదం.. హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. తన ఇద్దరు కుమార్తెలను ఆశ్రమంలో నిర్బంధించారని పిటీషన్ పేర్కొన్నారు. హెబియస్ కార్పస్ పిటీషన్ పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రాన్ని మంగళవారం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది ప్రభుత్వ అధికారులో కూడిన బృందం తనికీలు నిర్వహించిన విషయం తెలిసిందే.