స్విగ్గీ సర్వే 2019: జాతీయ ఆహార తేదీలు ఇవే!

ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ స్విగ్గీ తాజాగా జరిపిన సర్వేలో దేశవ్యాప్తంగా అందరూ చాలా ఇష్టపడి తినే ఆహారంగా బిర్యానీ నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ప్రతీ నిమిషానికి 95 మంది బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారంటే దీనిపై భారతీయులకు ఉన్న మోజును అర్థంచేసుకోవచ్చు. నాన్‌వెజ్‌లో చికెన్ బిర్యానీ మొదటిస్థానంలో ఉండగా, శాఖాహారంలో మసాలా దోశ, పన్నీర్ బట్టర్ మసాలాకు ఎక్కువ డిమాండ్ ఉంది.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 530కి పైగా స్విగ్గీ డెలివరీ కేంద్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. ఇక మార్కెట్లో 50 శాతం వాటాతో స్విగ్గీ మొదటి స్థానంలో ఉండగా, 26 శాతం వాటాతో జొమాటో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 35వేల 56 రకాల బిర్యానీలు సరఫరా చేస్తున్న స్విగ్గీ.. బోన్‌లెస్ చికెన్ బిర్యానీ, చికన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలకే అత్యధికంగా డిమాండ్ ఉందని తేల్చింది.
ఆరోగ్యమే మహా భాగ్యం:
ఈ ఏడాది భోజన ప్రియులు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు స్విగ్గీ సర్వేలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే కేలరీలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఫుడ్‌కి ఆర్డర్లు మూడు రెట్లు పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. కీటో బ్రౌనీస్, కీటో ఫ్రెండ్లీ టస్కాన్ చికెన్, హెల్దీ రెడ్ రైస్ పోహా వంటి వాటిని అత్యధికంగా ఇష్టపడుతున్నారు.
నోరూరించే గులాబ్‌జామ్:
ఇక తీపి పదార్థాలు విషయానికి వస్తే.. అన్నీటికంటే ఎక్కువ ఆర్డర్లతో గులాబ్‌జామ్ దూసుకుపోతోంది. ఈ ఏడాది పది నెలల్లో 17.69 లక్షల మంది గులాబ్‌జామ్ కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత 11.94 లక్షల ఆర్డర్లతో ఫలూదా రెండో స్థానంలో నిలిచింది. శీతల పానీయాల్లో ఫలూదాకు ఒక్కసారిగా ఈ స్థాయిలో డిమాండ్ పెరగడంపై స్విగ్గీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఒకేరోజు అత్యధిక ఆర్డర్లు ఇవ్వడం ద్వారా భోజన ప్రియులు ఈ ఏడాది ప్రత్యేకంగా కొత్త జాతీయ ఆహార తేదీలను కూడా ప్రకటించుకున్నారట. ఫిబ్రవరి 17 జాతీయ గులాబ్‌జామ్ డే, మే 12 కాఫీ డే, జూన్ 16 ఫ్రెంచ్ ఫ్రైస్, సెప్టెంబర్ 22 పిజ్జా, అక్టోబర్ 20 బిర్యానీ, టీ డేలుగా ప్రకటించుకోవడం విషేషం.