టీ20 మహిళా వరల్డ్ కప్ : హర్మన్ పుట్టిన రోజు..విజయీభవ..దిగ్విజయీభవ

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 02:46 AM IST
టీ20 మహిళా వరల్డ్ కప్ : హర్మన్ పుట్టిన రోజు..విజయీభవ..దిగ్విజయీభవ

Updated On : March 8, 2020 / 2:46 AM IST

టీ20 మహిళా వరల్డ్ కప్ ఫైనల్ కోసం.. యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈరోజు జరిగే ఈ మ్యాచ్‌ కోసం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఎంతో ప్రత్యేకం కానుంది. ఇవాళ 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్న హర్మన్.. తన కెరీర్ లోనే పెద్ద మ్యాచ్‌ను ఆడబోతోంది. ఫైనల్ పోరులో గెలిస్తే కౌర్ కు అంతకు మించిన కానుక ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు.. టైటిల్ పోరులో టీమిండియా గెలిచినా ఓడినా.. కౌర్‌కు మాత్రం ఆమె జీవితంలో ఎప్పటికీ ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

హర్మన్ ఆధ్వర్యంలో భారత జట్టు ఫైనల్‌ దాకా చేరింది. 2009లో జరిగిన తొలి టీ20 ప్రపంచక్‌పలోనే హర్మన్‌ప్రీత్‌ భారత్‌ తరఫున బరిలోకి దిగింది. ఆ తర్వాత క్రమంగా ఆఫ్‌ స్పిన్నర్‌గా, స్టార్‌ బ్యాటర్‌గా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక 2016లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హర్మన్‌.. 2017 వరల్డ్ కప్ లో అదరగొట్టింది. ఇక ప్రస్తుత ప్రపంచ కప్ లో ఇంతవరకూ హర్మన్ పెద్దగా రాణించకపోయినా.. కెప్టెన్ గా మాత్రం అద్భుతం చేస్తోంది.

కీలక సమయంలో పుంజుకోవడమెలాగో హర్మన్‌కు బాగా తెలుసు.. భారీ సిక్సర్లతో విరుచుకుపడే హర్మన్‌ మళ్లీ తన బ్యాట్‌ను ఝుళిపిస్తూ ఆసీస్ పై  ఊచకోతకు దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే మహిళల క్రికెట్‌ కప్‌తో స్వదేశానికి తిరిగిరావడం ఖాయం. ఇక ఫైనల్ మ్యాచ్ హర్మన్‌ ప్రీత్‌కు మరో మధుర అనుభూతిని కూడా మిగల్చనుంది. తమ కూతురిని క్రికెట్‌ స్టేడియంలో ప్రత్యక్షంగా తిలకించేందుకు వారు ఇప్పటికే భారత్‌ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నారు. దీంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తల్లిదండ్రుల సమక్షంలో ఫైనల్‌ గెలిచి కప్‌ను అందుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బలంగా కోరుకుంటోంది.

Read More : All The Best : మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్..ఆస్ట్రేలియా Vs భారత్