Actor Vijay TVK Guarantees: తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో TVK ప్రభంజనం.. విజయ్ విజయాన్ని నిర్దేశించిన 7 హామీలివే..!
Vijay TVK Guarantees : తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే 100కు పైగా స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. మరి టీవీకే గ్రాండ్ విక్టరీకి ప్రధాన కారణం ఏంటంటే..
tamil nadu assembly election results 2026 tvk leads more than 100 seats vijays 7 remarkable guarantees main reason for this strong start
Actor Vijay TVK Guarantees : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే తమిళనాడులో కనీవినీ ఎరగని రీతిలో హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజసం సృష్టిస్తోంది. ఎన్నికల బరిలో దిగిన తొలిసారే.. గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 సాధించి.. అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. తమిళనాడులో మొన్నటి వరకు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మూడో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.
పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే విజయ్ టీవీకే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త రికార్డ్ అంటున్నారు. అయితే విజయ్ పార్టీ గెలుపుకు ప్రధాన కారణం ఎన్నికల వేళ ఆ పార్టీ ఇచ్చిన హామీలే అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఏడు హామీలు విజయ్‌ని విజయతీరాలకు చేర్చనున్నాయి. ఇంతకీ ఆ హామీలు ఏవంటే..
1. ‘మదిప్పుమిగు మగళిర్ తిట్టం’ పథకం
దీని ద్వారా.. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు మహిళా గృహ యజమానులకు నెలకు రూ. 2,500 అందించి.. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పిస్తామని ఎన్నికల వేళ టీవీకే హామీ ఇచ్చింది. TVK ఇచ్చిన వాటిల్లో ఇదే అతిపెద్ద వాగ్దానం.
2. అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం
దీని ద్వారా రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి ఖర్చులను తగ్గించే దిశగా ఇది అతి కీలకమైన హామీగా నిలవబోతుంది.
3. అన్నన్ సీర్ తిట్టం
ఈ పథకం ద్వారా.. రాష్ట్రంలో ఆడబిడ్డల వివాహం సందర్భంగా 8 గ్రాముల బంగారం విరాళంగా ఇస్తానని టీవీకే వాగ్దానం చేసింది. దీంతో పాటు పట్టు చీరలను విరాళంగా ఇచ్చే పథకం కూడా ఓటర్ల దృష్టిని ఆకర్షించింది.
4. ‘కామరజార్ కల్వి ఉరుధి తిట్టం’
టీవీకే పార్టీ అతి ముఖ్యమైన హామీల్లో ‘కామరజార్ కల్వి ఉరుధి తిట్టం’ ఒకటి. రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందిస్తామంటూ టీవీకే ఈ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ. 15 వేల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం పేదరికం వల్ల ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదు.
5. వెట్రి పయనం తిట్టం
ఈ పథకం ద్వారా.. రాష్ట్రంలోని మహిళల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
6. రూ. 4 వేలు నిరుద్యోగ భృతి
యువతను ఆకర్షించేందుకు, నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ. 2,500 ఇవ్వనున్నట్లు టీవీకే తెలిపింది.
7. రుణమాఫీ
TVK ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. దీని ద్వారా.. 5 ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అలానే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి 50 శాతం వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.
టీవీకే ప్రకటించిన ఈ హామీలు ఓటర్లను ఆకర్షించి ఆ పార్టీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే వీటి అమలు టీవీకే ముందున్న అతి పెద్ద సవాలు అంటున్నారు.
