తమిళనాడు గవర్నర్ కు కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : August 2, 2020 / 06:53 PM IST
తమిళనాడు గవర్నర్ కు కరోనా పాజిటివ్

Updated On : August 2, 2020 / 7:22 PM IST

తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా వైరస్‌ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. .భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే చెన్నైలోని కావేరి హాస్పిటల్ డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కావేరి ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు.


గవర్నర్‌ను హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంచి కొంతమంది డాక్టర్లతో కూడిన బృందం పర్యవేక్షించనుంది.జూలై- 29న చెన్నైలోని రాజ్‌భవన్‌ సిబ్బందిలోని ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు.

తాజాగా ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాజ్‌భవన్‌లో మరోసారి అలజడి రేగింది. అంతకుముందు 84 మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు, సెక్యూరిటీ, ఫైర్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన వారే ఉన్నారు. ఆ క్రమంలోనే రాజ్‌భవన్‌ ప్రధాన బిల్డింగ్‌లో ఎవరూ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అదే సమయంలో గవర్నర్‌తో కూడా ఎవరూ కూడా కాంటాక్ట్‌ కాలేదని సదరు అధికారి తెలిపారు.