వ్యాపారి ఇంట్లో కాల్పులు..భార్యా, కొడుకుతో సహా ముగ్గురు మృతి

Tamilnadu Chennai : చెన్నైలోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన కొంతమంది దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలోని వినయగ మాస్త్రీ వీధిలో అపార్ట్‌మెంట్‌లోని ఫస్ట్ ఫ్లోర్ లో దిలీప్ తలీల్ చంద్ (74) అనే వ్యాపారి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.
ఈక్రమంలో బుధవారం (నవంబర్ 11,2020) రాత్రి సాయంత్రం ఆయన ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో వ్యాపారి దిలీప్ తలీల్, ఆయన భార్య పుష్పాబాయి (70), వ్యాపారి కొడుకు శీర్షిత్ (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తలీల్ చంద్ ఇంటి సమీపంలో దుండగులను గుర్తించే పనిలో పబడ్డారు. గుర్తు తెలియని వ్యక్తి తుపాకితో తిరుగుతున్నట్టు గుర్తించారు.
సదరు వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన బాబుసింగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనకున్న కారణాల కోసం దర్యాప్తు చేపట్టారు. వ్యాపార లావాదేవీలే ఈ హత్యలకు కారణమా? లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసు కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్, అదనపు కమిషనర్ అరుణ్ ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.
వ్యాపార ఆర్థిక లావాదేవీలే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తలీల్ చంద్ కుమారుడు శీర్షిత్.. భార్య నుంచి విడిపోయాడు. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో పెండింగులో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలంలో ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణకు ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని కమిషనర్ అగర్వాల్ తెలిపారు.