ఆటోవాలా అరాచకం : 18 కిలోమీటర్లకు రూ.4 వేలు వసూలు

ఆటో ఎక్కని వారు ఎవరూ ఉండరు.. 10 రూపాయలు ఎక్కువ చెబితేనే అమ్మో అంటాం.. అలాంటిది 4వేల రూపాయల ఛార్జ్ వేస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది కదా.. ఇది నిజం. ఆటో ఎక్కిన పాపానికి అక్షరాల 4వేల 300 రూపాయలు కట్టి.. ఇంటికెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కథ ఇది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పూణె నగరం. బెంగళూరుకి చెందిన ఓ కుర్రోడికి పూణెలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మంగళవారం రాత్రి బెంగళూరులో బయలుదేరాడు. బుధవారం తెల్లవారుజామున పూణెలోని కత్రాజ్-దేహు బైపాస్ రోడ్డులో దిగాడు. క్యాబ్ బుక్ చేద్దాం అంటే నో వెహికల్స్ అనే మెసేజ్ వచ్చింది.
ఇదే సమయంలో ఓ ఆటో వచ్చింది. ఎర్రవాడ వెళ్లాలి అంటే ఓకే అన్నాడు. ఎంత ఛార్జి అంటే.. మీ ఇష్టం సార్.. ఎంతైనా ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చాడు ఆటోవాలా. రేటు కచ్చితంగా చెప్పాలన్న ఐటీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు ఆటోవాలా. అప్పటికే అందులో ఉన్న మరో వ్యక్తితో కలిసి బలవంతంగా ఆటోలో ఎక్కించాడు. 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవాడ దగ్గరకు తీసుకెళ్లాడు. నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆపాడు. 4వేల 300 రూపాయల బిల్లు అయ్యిందని.. ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
మీటర్ మాత్రం జీరో చూపిస్తుందని.. అంత ఇవ్వనని తెగేసి చెప్పాడు. 600 రూపాయలు ఇస్తానని ఐటీ ఉద్యోగి అనటంతో కొట్టటానికి ప్రయత్నించారు. దీంతో తన పర్సులో ఉన్న 4వేల 300 రూపాయలు ఇచ్చేశాడు ఐటీ ఉద్యోగి. పూణెకు కొత్త అని చెప్పుకొచ్చాడు. మొదటిసారి అడుగుపెట్టినప్పుడే ఇలా జరిగటంపై ఆందోళనలో ఉన్నాడు ఉద్యోగి. ఆ తర్వాత ఎర్రవాడ పోలీస్ స్టేషన్ లో కంప్లయిట్ ఫైల్ చేశాడు. ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉండటంతో వేట మొదలుపెట్టారు పోలీసులు.