Bengaluru Blast: అమ్మ ఫోన్ కాల్ నన్ను బతికించింది: సాఫ్ట్‌వేర్ యువకుడు

శబ్దాలకు చెవుల్లో చిల్లులు పడ్డట్లు అనిపించిందని అన్నాడు. కేఫ్ పేలుడుకు సంబంధించిన తొలి వీడియోను షేర్ చేసిన వ్యక్తి అతనే.

Bengaluru Blast: అమ్మ ఫోన్ కాల్ నన్ను బతికించింది: సాఫ్ట్‌వేర్ యువకుడు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు బ్లాస్ట్ నుంచి తృటిలో బయటపడ్డాడు ఓ యువకుడు. పాట్నాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుమార్ అలంకృత్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు వివరించి చెప్పాడు.

ఆఫీసు లంచ్ సమయంలో భోజనం చేయడానికి రామేశ్వరం కేఫ్‌కి వెళ్లాడు. ఇడ్లీ, దోశ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత ఒక టేబుల్‌ వైపు వెళ్తుండగా, అతడి తల్లి నుంచి కాల్ వచ్చింది. దీంతో అతడు తన తల్లితో ఫోనులో మాట్లాడటానికి కేఫ్ నుండి బయటికి వచ్చాడు. అంతే.. కేఫ్ లోపల ఒక్కసారిగా పేలుడు శబ్దం వినపడింది.

బాంబు పేలిన సమయంలో కేఫ్‌కు 10-15 మీటర్ల దూరంలో ఉన్నానని అతడు చెప్పాడు. ఆ పేలుడుతో భారీ శబ్దం వినపడిందని తెలిపాడు. చెవుల్లో చిల్లులు పడ్డట్లు అనిపించిందని అన్నాడు. కేఫ్ పేలుడుకు సంబంధించిన తొలి వీడియోను షేర్ చేసిన వ్యక్తి అతనే. ఇంతటి భయంకరమైన దృశ్యాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని అలంకృత్ చెప్పాడు.

అందరూ కేఫ్ నుంచి బయటకు పరుగెత్తారని, దట్టంగా పొగ కనపడిందని, మొదట గ్యాస్ సిలిండర్ పేలిపోయిందని అందరూ భావించారని తెలిపాడు. అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బంది రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పాడు. ప్రజల ముఖాల్లో భయం కనిపించిందని అన్నాడు.

‘మా అమ్మ వల్లే నేను బతికాను. ఆ సమయంలో అమ్మ ఫోన్ కాల్ రాకపోతే నేను కౌంటర్ దగ్గరే కూర్చునేవాడిని. నాకు గాయాలయ్యేవి. అందుకే దేవుడు అమ్మరూపంలో ఉంటాడని అంటారు’ అని అలంకృత్ అన్నాడు.

కాగా, శుక్రవారం పేలుడు జరగడానికి నిమిషాల ముందు రామేశ్వరం కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనపడ్డాయి. నిందితుడు బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచి, పేలుడు జరగడానికి ముందు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనుమానితుడితో పాటు కనిపించిన మరో వ్యక్తిని కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read: క్యాబ్‌లో ఇంత తక్కువ దూరానికి అంత బిల్లా? షాక్ అయిన ప్రయాణికుడు