Jharkhand : దారుణ ఘటన.. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన కుమార్తె.. రెండ్రోజుల తరువాత బిగ్ షాకిచ్చిన పోలీసులు
Jharkhand : జార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల కుమార్తె ప్రియుడితో కలిసి తన తల్లిని హత్య చేసింది. అయితే, ఈ ఘటనలో రెండ్రోజుల తరువాత పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
Jharkhand
- జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో దారుణ ఘటన
- ప్రియుడితో కలిసి తల్లిని హత్యచేసిన 17ఏళ్ల బాలిక
- అత్యక్రియలు జరిగిన రెండ్రోజులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
Jharkhand : జార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల కుమార్తె ప్రియుడితో కలిసి తన తల్లిని హత్య చేసింది. రూ.45లక్షల కోసం ఈ దారుణానికి పాల్పడింది. తన తల్లి బాత్ రూంలో పడిపోయి మరణించినట్లు అందరినీ నమ్మించింది. బంధువులొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రెండ్రోజుల తరువాత మృతురాలి మెడపై గాయాలు కనిపించినట్లు బంధువుల్లోని ఒకరు చెప్పడంతో.. ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో నహీదా పర్వీన్, ఆమె దత్తత తీసుకున్న 17ఏళ్ల కుమార్తె నివాసం ఉంటున్నారు. పర్వీన్ భర్త విద్యుత్ శాఖలో పనిచేస్తూ నాలుగేళ్ల క్రితం మరణించాడు. సర్వీసులో ఉండగా భర్త మృతితో విద్యుత్ విభాగం నుంచి పరిహారం కింద పర్వీన్ కు రూ.45లక్షలు వచ్చాయి. ఈ డబ్బుకు పర్వీన్ కూతురును నామినీగా పెట్టారు. అయితే, పర్వీన్ కుమార్తె అప్పటికే బిహార్ రాష్ట్రంలోని గయాకు చెందిన 20ఏళ్ల అర్బాజ్ ఖాన్ తో ప్రేమలో ఉంది. అర్బాజ్ అడిగినప్పుడల్లా ఆ బాలిక డబ్బులిస్తూవ చ్చింది. ఈ విషయం పర్వీన్ కు తెలియడంతో కుమార్తెను మందలించింది.
తల్లి పర్వీన్ పై కుమార్తె కోపం పెంచుకుంది. తల్లిని అడ్డు తొలగించుకుంటే ఆమె వద్ద ఉన్న రూ.45లక్షలతోపాటు విద్యుత్ శాఖలో మానవీయ కోణంలో ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుందని భావించింది. ఈ విషయాన్ని ప్రియుడు అర్బాజ్ కు చెప్పింది. అతను ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి పర్వీన్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పర్వీన్ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో 17ఏళ్ల కుమార్తె తన ప్రియుడు అర్బాజ్‌తో పాటు అర్బాజ్ స్నేహితులైన మరో ముగ్గురుతో కలిసి హత్య చేసింది. ముగ్గురు స్నేహితులు పర్వీన్ కాళ్లు, చేతులు పట్టుకోగా.. బాలిక ప్రియుడు అర్బాజ్ కలిసి పర్వీన్ ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా హత్య చేశారు. ఆ తరువాత బాలిక తమ బంధువులకు ఫోన్ చేసి బాత్ రూంలో పడిపోయి పర్వీన్ మృతిచెందినట్లు తెలిపింది.
బంధువులు వచ్చి పర్వీన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తయిన రెండు రోజుల తరువాత బంధువుల్లోని ఓ వ్యక్తి పర్వీన్ మెడపై గాయాలు గుర్తించినట్లు చెప్పాడు. దీంతో పర్వీన్ బావ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకిదిగి విచారణ చేపట్టగా పర్వీన్ కుమార్తెపై అనుమానం వచ్చింది. ఆ బాలికను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి వద్ద ఉన్న రూ.45లక్షల కోసం హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెతోపాటు ఆమె ప్రియుడు, వారికి సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
