IMD : దేశంలో భారీ వర్షాలు..తెలంగాణలో కూడా

దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం... 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

IMD : దేశంలో భారీ వర్షాలు..తెలంగాణలో కూడా

Imd

Updated On : May 14, 2021 / 11:40 PM IST

Heavy Rain : దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం… 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు.. గుజరాత్‌, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

అరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశముంది. దక్షిణ తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే చాన్స్‌ ఉంది.

అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 36 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగాను, అనంతరం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశంలోని దక్షిణ ప్రాంతంలో భారీవర్షాలు కురియనున్నాయి. రాగల 24 గంటలలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఐఎండీ హెచ్చరికతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. కేరళలోని ఐదు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. దీంతో తిరువనంతపురం, కొల్లాం, పథ్తినంతిట్ట, అలప్పుజ, ఎర్నాకులంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఐదు జిల్లాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. లక్షద్వీప్‌లోని 3 జిల్లాలలో కూడా రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

ఈ తుపాన్‌కు మయన్మార్‌ సూచించిన తౌక్టే పేరుని పెట్టనున్నట్లు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఈ తుపాను మే 18న గుజరాత్‌ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్‌లో మే 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఐదారు రోజుల పాటు గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్లు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read More : Uttar Pradesh : కారు కొనేందుకు మూడు నెలల కొడుకును అమ్మేశారు