రైతు చట్టాలపై నేడు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

The Supreme Court today issued key Directions on farmer laws
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశమంతా తిరుగుబాటు చేస్తుంటే.. సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మూడు సాగు చట్టాలను సస్పెండ్ చేస్తామంటూ సంకేతాలిచ్చింది. కమిటీ ఏర్పాటుతో పాటు వ్యవసాయ చట్టాలపై సుప్రీం ధర్మాసనం నేడు కీలక ఆదేశాలు ఇవ్వనుంది.
వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రైతుల పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతుండటంతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని తెలిపింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలని.. వాటికి మేము బాధ్యులం కావాలని భావించడం లేదని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశమంతా తిరుగుబాటు చేస్తుంటే.. లాభదాయకంగా ఉన్నాయని ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని తెలిపింది. వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తారా…లేదా కోర్టునే ఆ పనిచేయమంటారా అంటూ ప్రశ్నించింది.
మరోవైపు వ్యవసాయ చట్టాలను నిలిపివేయడం సాధ్యం కాదని కేంద్రం వాదించింది. ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు కోర్టుకు లేదంది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. కొత్త చట్టాలపై మూడు రాష్ట్రాలు తప్ప దేశం సంతృప్తిగా ఉందని వాదించారు.
రైతుల సమస్య పరిష్కారానికి ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. దీనిపై రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రైతుసంఘాల తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు చెప్పారు. మాజీ సీజేఐ జస్టిస్ ఆర్ ఎం లోధా అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. ఆందోళన చేస్తున్న వృద్ధులు, మహిళలు వెనక్కి వెళ్లేలా చూడాలని కోర్టు సూచించింది.
ఇప్పటివరకు రైతు సంఘాలు, కేంద్రానికి మధ్య 8 విడతల్లో చర్చలు జరిగాయి. 3 సాగు చట్టాలపై కేంద్రం, రైతులు పట్టు వీడకపోవడంతో ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చట్టాలను రద్దు చేసేవరకు ఢిల్లీ సరిహద్దు నుంచి కదిలేది లేదని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ నెల 15న రైతు సంఘాలతో కేంద్రం జరిపే చర్చలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.