కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట ప్రజలు దాని బారిన పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ తిరుమల తిరుపతి దేవస్దానాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే 15 మందికి పైగా అర్చకులకు కరోనా సోకింది.
తాజాగా శ్రీవారి ఆలయం పెద్దజీయర్ స్వామికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో టీటీడీ అధికారులు స్వామిజీని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్ కు తరలించారు. ఇప్పటివరకు 170 కరోనా పాజిటివ్ కేసులు టీటీడీ లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కరోనా సోకినట్లు పేర్కొన్నారు.
మరో వైపు తిరుమలలో కరోనా కేసులు పెరుగుతున్నందున స్వామి వారి దర్శనాలు నిలిపి వేయాలని ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు కోరారు. ఈమేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
మరో వైపు తిరుమలలో పరిస్థితులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష జరిపారు. టీటీడీ ఈవో, అదనపు ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. కరోనా వైరస్ సోకిన జీయర్ స్వాములు, అర్చకులతో పాటు ఇక మిగిలిన టీటీడీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అర్చకులకి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటే దర్శనాలు కూడా ఆపివేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.