CV Raman : ‘సైన్స్ నా మతం’ అన్న మహనీయుడు.. సీవీ రామన్ జయంతి నేడు
తుది శ్వాస వరకు సైన్స్ అభివృద్ధి కోసం పాటు పడటమే కాదు.. ఇప్పటి తరం విద్యార్ధులకు సైన్స్ పట్ల మక్కువ కలిగేలా స్ఫూర్తి నింపిన మహనీయుడు సర్ సివి రామన్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనసారా నివాళులు అర్పిద్దాం.

CV Raman
CV Raman : 200 రూపాయలు కూడా విలువ చేయని పరికరాలతో ఆయన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు.. ఈ పరిశోధనను ధ్రవీకరించిన ఫిబ్రవరి 28 న ‘సైన్స్ డే’ గా జరుపుకుంటున్నాం. సైన్స్ అంటే స్టూడెంట్స్‌కి మక్కువ పెరిగేలా చేసిన మహనీయుడు సర్ సివి రామన్ జయంతి నేడు. ఆ మహానుభావుడు సైన్స్‌కి చేసిన సేవల్ని మనసారా తల్చుకుంటూ నివాళులు అర్పిద్దాం.
‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి’ 1954 లో భారతరత్న అందుకున్న సందర్భంలో సీవీ రామన్ అన్న మాటలివి. ఇప్పటికీ ఈ మాటలు అందర్నీ ఆలోచింప చేస్తాయి. చివరి వరకు సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డారు సివి రామన్. 1988 నవంబర్ 7 న తిరుచినాపల్లి సమీపంలోని పెటాయ్ అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించారు చంద్రశేఖర వెంకటరామన్. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయనకి చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల మక్కువ ఉండటం భౌతికశాస్త్రం వైపు మళ్లేలా చేసింది.
1907 లో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు సివి రామన్. 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఆయన రాసిన పరిశోధనా వ్యాసం పరిశీలించిన అధ్యాపకులు ఇంగ్లాండ్ వెళ్లి పరిశోధనలు చేయమని ప్రోత్సహించారట. ఇంగ్లాండు వాతావరణానికి ఆయన సరిపడడని వైద్యుడు చెప్పడంతో సివి రామన్ ఇంగ్లాండ్ వెళ్లడం విరమించుకున్నారట. ఎమ్మె చదివి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సైన్స్ పరిశోధనలు కొనసాగించారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ ఆర్ధిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. లోకసుందరి అమ్మాళ్‌ను పెళ్లాడారు. సైన్స్‌పై మక్కువ చంపుకోలేక మరల ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా చేరారు.
1928 ఫిబ్రవరి 28 న పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం ద్వారా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించారు రామన్. దీనిని రామన్ ఎఫెక్ట్ అంటారు. 200 రూపాయలు కూడా విలువ చేయని పరికరాలతో ఆయన చేసిన ప్రయోగం చూసి శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈ పరిశోధనతో 1930 లో ఆయనను నోబెల్ బహుమతి వరించింది. 1954 లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి
తుది శ్వాస వరకు సైన్స్ అభివృద్ధి కోసం పాటుపడ్డారు సివి రామన్. 1970 నవంబర్ 20 న ఆయన కన్నుమూసినా.. ప్రతి సంవత్సరం ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.