Tomato Flu: టమాటో ఫ్లూ కలకలంతో కేరళ సరిహద్దుల వద్ద నిఘా పెంచిన తమిళనాడు ప్రభుత్వం
కేరళలో పిల్లలలో టమోటా జ్వరం కేసులు నమోదు కావడంతో కేరళతో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులోని అన్ని చెక్ పోస్టులపై నిఘాను పెంచింది ప్రభుత్వం.

Tamilnadu
Tomato Flu: దేశంలో విష జ్వరాలు పాకుతున్నాయి. కేరళ రాష్ట్రంలో చిన్నారుల్లో వెలుగు చూసిన ‘టమాటో ఫ్లూ’ ఇతర రాష్ట్రాల్లోనూ గుబులు రేపుతోంది. ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్నీ కేంద్ర వైద్యారోగ్యశాఖ దృష్టికి తీసుకువెళ్ళింది. కేరళలో పిల్లలలో టమోటా జ్వరం కేసులు నమోదు కావడంతో కేరళతో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులోని అన్ని చెక్ పోస్టులపై నిఘాను పెంచింది ప్రభుత్వం. దద్దుర్లు మరియు బొబ్బలు ఉన్న పిల్లలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రతి చెక్ పోస్ట్ వద్ద మూడు బృందాలను మోహరించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. పాలక్కాడ్ జిల్లా వాలాయార్ చెక్ పోస్టు, తిరువనంతపురం నుంచి కలియకావళి, తేని చెక్ పోస్టుల వద్ద..ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పటు చేశారు. ఐదేళ్ల లోపు పిల్లలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు తమిళనాడు వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య, పోలీసు, రెవెన్యూ బృందాలను సరిహద్దల వద్ద మోహరించారు.
Other Stories:Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు
కేరళలోని అనేక జిల్లాల్లో పిల్లల్లో టమోటా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. అయితే వ్యాధి తీవ్రతను అంచనా వేయలేని వైద్యశాఖ అధికారులు..ఇప్పటికైతే వ్యాధి సోకిన చిన్నారులకు ప్రత్యేక అత్యవసర వైద్యం అందిస్తున్నారు. టమాటో ఫ్లూ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. చిన్నారుల ఒంటిపై దద్దుర్లు, బొబ్బలు వ్యాపించడం ఈ వ్యాధి లక్షణాలు. ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్నారులు బయట తిరగవద్దని, తరచూ వేడి నీరు తాగుతూ, బలవర్ధకమైన భోజనం తీసుకోవాలని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది.
Other Stories:Delhi Mundka fire: ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఇద్దరిపై కేసు నమోదు