ఉగ్రవాదులతో 12లక్షలకు డీఎస్పీ డీల్ ..ప్రమోషన్ వచ్చే టైంలో దొరికాడు

కాశ్మీర్‌లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శనివారం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు మాటు వేసి వారిని పట్టుకున్న విషయం తెలిసిందే.
డీఎస్పీని అరెస్ట్ చేసిన పోలీసులు కీలక వివరాలను రాబట్టారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ నవీద్ ముస్తాఖ్, టెర్రరిస్ట్ రఫీని బనిహాల్ టన్నెల్‌ను సురక్షితంగా దాటించేందుకు డీఎస్పీ ఉగ్రవాదులతో 12లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు.
బాదామిబాగ్ కంటోన్మెంట్‌లోని ఆర్మీ XV కార్ప్స్ హెడ్‌క్వార్ట్స్ సమీపంలో ఉండే తన నివాసంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడని విచారణలో వెల్లడయింది. శనివారంతో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు లాయర్ ఇర్ఫాన్ కూడా డీఎస్పీ ఇంట్లోనే ఉన్నారని తెలిసింది. శనివారం సెలవులో ఉన్న డీఎస్పీదవీందర్ సింగ్ శ్రీనగర్ లోని తన నివసం నుంచి ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో వేగంగా బయలుదేరారు. ముందుగానే పోలీసు ఉన్నతాధికారులు ఈ సమాచారం అందడంతో వాళ్లు అలర్ట్ అయ్యారు.
జమ్మూతో కనెక్ట్ అయ్యే టన్నెల్ ను కారు దాటివెళ్లిందంటే కారును ట్రాక్ చేయడం కష్టమని భావించిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి జవహర్ టన్నెల్ దాటక ముందే ఐ10కారులో ప్రయాణిస్తున్న డీఎస్పీ, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు వాంటెడ్ టెర్రరిస్టులను పట్టుకున్నారు. డీఎస్పీ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు రెండు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్, పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.శనివారం నుంచి గురువారం వరకు డ్యూటీకి సెలవులు పెట్టాడు. త్వరలో ఆయనకు ఎస్పీగా ప్రమోషన్ రావాల్సి ఉంది. కానీ అంతలోనే ఉగ్రవాదులతో కలిసి పట్టుబట్టాడు దవీందర్. ఉగ్రవాదులకు సాయం చేసినందుకు గాను అతడిని కూడా ఉగ్రవాదిగానే భావిస్తామని కాశ్మీర్ IGP విజయ్ కుమార్ తెలిపారు.
అయితే తానేతప్పు చేయలేదని విచారణలో డీఎస్పీ దవీందర్ సింగ్ బుకాయిస్తున్నాడు. పోలీసుల దగ్గర లొంగిపోవడం కోసమే టెర్రరిస్టులను తీసుకెళ్తున్నానని.. అంతేతప్ప వారితో చేతులు కలపలేదని దవీందర్ సింగ్ తెలిపాడు. అయితే ఉగ్రవాదులను ప్రత్యేకంగా విచారించిన అధికారులు.. అసలు వారి మధ్య సరెండర్ గురించి చర్చ జరగలేదని గుర్తించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో డీఎస్పీకి సంబంధాలు ఉన్నాయని అంచనాకు వచ్చారు. కొన్నివారాలుగా డీఎస్పీ దవీందర్ సింగ్ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్‌లో అనుమానముంది. ఈ క్రమంలోనే శనివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దవీందర్ సింగ్ తో పాటు దొరికిన ఇద్దరు టెర్రరిస్టులలో ఒకరు నవీద్ బాబు, మరొకరు రఫీ అహ్మద్. వీరిలో నవీద్ బాబు కూడా గతంలో పోలీస్ శాఖలో పని చేశాడు. బుడ్దామ్‌లోని ఫుడ్ అండ్ సప్లయ్ సెక్యూరిటీ వింగ్‌లో 2017 వరకూ నవీద్ బాబు విధులు నిర్వహించాడు. తర్వాత మే 2017లో ఏకే 47 రైఫిల్‌తో పరారైన నవీద్ బాబు హిజ్బుల్ ముజాయిద్ధీన్ ఉగ్రవాదిగా మారిపోయాడు. నవీద్ బాబు ఒక్కడే ఓ 30మంది టెర్రరిస్టుల గ్రూప్‌ని లీడ్ చేస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. కశ్మీర్ లోయలో కనీసం 12మంది పోలీసుల హత్యల వెనుక నవీద్ బాబు హస్తం ఉంది. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ లో స్థానికేతర లారీ డ్రైవర్లు,పండ్ల వ్యాపారుల హత్యల వెనుక కూడా నవీద్ బాబు హస్తం ఉన్నట్లు తేలింది.
అంటే కరుడుగట్టిన ఉగ్రవాదుల ముఠాతో DSP దవీందర్ సింగ్ చేతులు కలిపినట్లు అర్ధమవుతోంది. ఇప్పుడు తేలాల్సింది దవీందర్ సింగ్ ఎంతమంది ఉగ్రవాదులకు సాయం అందించాడు. ఎంతమందిని దేశం దాటించాడు..అలానే ఇంకా ఎంతమంది పోలీసులు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే..పోలీస్ వ్యవస్థతో పాటు నిఘా వ్యవస్థలోని లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో బైటపడుతుంది.