Bombay High Court : చిన్నపిల్లల బుగ్గలు తాకడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
లైంగిక ఉద్దేశం లేకుండా చిన్నపిల్లల బుగ్గలు తాకడం నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైంగిక ఉద్దేశం

Bombay High Court
Bombay High Court : లైంగిక ఉద్దేశం లేకుండా చిన్నపిల్లల బుగ్గలు తాకడం నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘లైంగిక ఉద్దేశం లేకుండా చెంపలు తాకడం లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కాదు. పోక్సో చట్టం సెక్షన్ 7లో ఇదే ఉంది. నిందితుడు తప్పుడు ఉద్దేశంతో చిన్నారి బుగ్గ గిల్లినట్లు ప్రైమరీ రిపోర్టులో లేదు’ అని కోర్టు తెలిపింది. అనంతరం ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చింది కోర్టు.
చిన్నారి బుగ్గ గిల్లిన కేసులో 46ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు 13 నెలలుగా జైల్లో ఉన్నాడు. 2020 జూలైలో అతడిని అరెస్ట్ చేశారు. ఓ తల్లి అతడిపై ఫిర్యాదు చేసింది. తన ఎనిమిదేళ్ల కూతురు అతడి షాప్ కి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి తన కూతురితో అనుచితంగా ప్రవర్తించాడని, బుగ్గలు గిల్లాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.
నిందితుడు ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం అప్లయ్ చేసుకున్నాడు. అయితే కోర్టు అతడి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. కాగా, నిందితుడు తరుఫు న్యాయవాది బాంబే హైకోర్టులో వాదనలు వినిపించాడు. తన క్లయింట్ పై తప్పుడు కేసు పెట్టారని, వ్యాపారంలో గొడవల వల్ల ఆయనపై తప్పుడు కేసు పెట్టారని కోర్టుకి చెప్పాడు.
మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా ఉంది. నిందితుడు చిన్నారిని తన షాపులోకి రావాలని పిలిచాడు. చిన్నారి వచ్చాక అతడు బటయకు వెళ్లి చూశాడు. ఎవరూ లేరని గమనించుకున్నాక షట్టర్ దింపేశాడు. చిన్నారి తల్లి మరో వ్యక్తితో కలిసి షట్టర్ ఎత్తి చూడగా ఆ వ్యక్తి చిన్నారితో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు చూశారు.