నన్ను దోషిగా నిరూపించాలనుకోవడం తప్పు: మీడియాపై ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫైర్

రోజుకో వివాదంతో వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.

నన్ను దోషిగా నిరూపించాలనుకోవడం తప్పు: మీడియాపై ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫైర్

Trainee IAS officer Puja Khedkar first response on allegations

Updated On : July 15, 2024 / 8:33 PM IST

Trainee IAS officer Puja Khedkar: మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అధికార దుర్వినియోగం ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన ఆమెపై రోజుకో వార్త వెలుగు చూస్తోంది. తప్పుడు సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసినట్టు తాజాగా ఆరోపణలు వచ్చాయి. 2007లో నాన్ క్రిమిలేయర్ ఓబీసీ సర్టిఫికెట్ తో పుణేలోని శ్రీమతి కాశీబాయి నవలె మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ లో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. 2011–12లో ఎంబీఎస్ పూర్తి చేసి అదే కాలేజీలో ఇంటర్న్‌షిప్ కూడా కంప్లీట్ చేశారు.

తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా పూజా ఖేద్కర్ స్పందించారు. తనను దోషిగా నిరూపించేందుకు మీడియా ప్రయత్నిస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె వ్యాఖ్యానించారు. “నిందితులపై మోపిన అభియోగాలు రుజువయ్యేంతవరకు వారు నిర్దోషులేనని మన భారత రాజ్యాంగం చెబుతోంది. కాబట్టి నన్ను దోషిగా నిరూపించాలని మీడియా చేస్తున్న ప్రయత్నం తప్పు. ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. నేను ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ప్రస్తావించవచ్చు. కానీ నన్ను దోషిగా మీడియా నిరూపించాలనుకోవడం తప్ప”ని పూజా ఖేద్కర్ అన్నారు.

2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్.. 2022లో మల్టిఫుల్ డిజేబిలిటీ కేటగిరీలో ఆమె సివిల్స్ కు ఎంపికయ్యారు. ప్రొబేషన్‌లో భాగంగా పుణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఈ ఏడాది నియమితులయ్యారు. జూన్ 3న విధుల్లో చేరడానికి ముందే ఆమె గొంతెమ్మ కోరికలు కోరడంతో వార్తల్లోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆమెపై రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. అయితే తప్పుడు సర్టిఫికెట్ తో సివిల్స్ రాశారన్న ఆరోపణలతో పాటు పలు రకాల వివాదాల్లో ఆమె చిక్కుకున్నారు. పూజా ఖేద్కర్ తల్లి మనోరమ తన లైసెన్స్ డ్ గన్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో, ఆమెకు పుణే పోలీసులు షోకాజ్ నోటీసు జారీచేశారు.

Also Read : మాజీ ముఖ్యమంత్రి విడాకుల వ్యవహారం.. భార్యకు సుప్రీంకోర్టు నోటీసులు

పూజా ఖేద్కర్ వినియోగించిన లగ్జరీ ఆడీ కారును ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బిగించిన ప్రభుత్వ సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ సిస్టర్, వీఐపీ నంబర్ ప్లేటును తొలగించారు. కాగా, ఈ కారుతో 21 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలుస్తోంది.