Pulasa Fish: రెండే కేజీల చేప.. కళ్ళు చెదిరే ధర.. అయినా ఎగబడిన జనం!
పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. ఈ మాట చాలు కదా పులస చేప మీద ఉన్న అభిప్రాయమేంటో. ఔను.. పులస చేప పేరు చెబితే చాలు నోరు ఊరాల్సిందే.. గోదావరి జిల్లాల్లో ఎన్ని రకాల చేపలున్నా..

Pulasa Fish
Pulasa Fish: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. ఈ మాట చాలు కదా పులస చేప మీద ఉన్న అభిప్రాయమేంటో. ఔను.. పులస చేప పేరు చెబితే చాలు నోరు ఊరాల్సిందే.. గోదావరి జిల్లాల్లో ఎన్ని రకాల చేపలున్నా పులస టేస్టే వేరు. జీవితంలో దాని రుచి ఒక్కసారైనా చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే ఈ చేపలకు యమ క్రేజ్, మార్కెట్‌లో దొరికే చేపల ధర కిలో వందల రూపాయల్లో ఉంటే.. పులస చేప మాత్రం రూ.వేలు పలుకుతుంది.
ఎంతో రుచికరమైన పులస చేపలు భారీ ధర పలికినా వాటిని కొనేందుకు ప్రజలు పోటీపడుతుంటారు. ఈ ఏడాది గత రెండు నెలల నుండి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు యానాంలో కూడా పలు చోట్ల మత్య్సకారులకు దొరికిన పులస చేప భారీ ధర పలకగా తాజాగా యానాంలో దొరికిన రెండు చేపలకు భారీ డిమాండ్ నెలకొంది. సుమారు రెండు కిలోలకు పైగా బరువున్న రెండు పులసలు ఒక్కొక్కటీ 20 వేల రూపాయలకు పైగా ధర పలికింది.
ఇంత ధర పలకడం యానాం చరిత్రలోనే ఇదే తొలిసారి అంటున్నారు అక్కడి మత్స్యకారులు. గురువారం మార్కెట్‌కు తెచ్చిన పులసను నాగలక్ష్మి అనే మహిళ 23 వేలకు దక్కించుకోగా.. మరో పులసను భాగ్యలక్ష్మి అనే మహిళ 25 వేలకు వేలంలో దక్కించుకున్నారు. అంతేకాదు వెంటనే వాటిని మరికొంత లాభంతో అక్కడికక్కడే అమ్మడం విశేషం. గతేడాది పులస ధర రూ.20 వేలు పలికితేనే ఔరా అనుకుంటే.. ఇప్పుడు ఆ ధర రూ.25 వేలు దాటడం విశేషం. ఎంతైనా పులస పులసే కదా మరి!