భారత విమానాలపై యూఏఈ నిషేధం

భారత విమానాలపై యూఏఈ నిషేధం

Uae

Updated On : April 22, 2021 / 10:55 PM IST

UAE దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త నేప‌థ్యంలో ఈ నెల 25 నుంచి ప‌ది రోజుల పాటు భార‌త్ నుంచి అన్ని విమానాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు గురువారం యూనైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) తెలిపింది. ఇత‌ర దేశాల్లో 14 రోజుల‌పాటు ఉండ‌ని భార‌తీయ ప్ర‌యాణికుల‌ను కూడా అనుమ‌తించ‌బోమ‌ని తెలిపింది. భారత్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తప్పడం లేదంటూ వ్యాఖ్యానించింది.

అయితే యూఏఈ నుంచి విమానాలు,కార్గో రాక‌పోక‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది. యూఏఈ పౌరులు, దౌత్య అధికారులు, సిబ్బంది, వ్యాపార వేత్త‌ల విమానాల‌కు ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. అయితే వీరంతా ప‌ది రోజుల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాల‌ని, వ‌చ్చిన రోజుతోపాటు, త‌ర్వాత 4, 8 రోజుల్లో పీసీఆర్ ప‌రీక్ష చేయించుకోవాల‌ని పేర్కొంది. ఈ కేట‌గిరి వ్య‌క్తుల ప్ర‌యాణాల‌కు ముందుగా చేయించుకున్న క‌రోనా ప‌రీక్ష గ‌డువును 72 గంట‌ల నుంచి 48 గంట‌ల‌కు కుదించింది. కేవ‌లం అనుమ‌తించిన ల్యాబ్ రిపోర్టుల‌ను మాత్ర‌మే అంగీక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

కాగా,ఇప్పటికే అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్, చైనా దేశాలు కూడా భారత్ కు రాకపోకల విషయంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియా కూడా ఇండియా నుంచి నేరుగా వచ్చే విమానాల రాకపోకలను నియంత్రించింది. తాజాగా యూఏఈ తీసుకున్న నిర్ణయంతో పెద్ద సంఖ్యలో గల్ఫ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు దుబాయికి వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి నిత్యం భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచి దుబాయికి విమానాల సర్వీసులు నడుస్తున్నాయి. ఈ పది రోజుల నిషేధంతోనే ఆగిపోతారా? లేక ఈ నిషేధాన్ని మరింత కాలం కొనసాగిస్తారా? అని భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు గల్ఫ్ కార్మికులు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలపై నిషేధం తప్పదా? అన్న అనుమానాలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయి.