ఓటరు ఆకర్షక బడ్జెట్ : వరాల వాన
అందరూ ఊహించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ఓటరు ఆకర్షక బడ్జెట్‌తో ముందుకొచ్చింది.

అందరూ ఊహించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ఓటరు ఆకర్షక బడ్జెట్‌తో ముందుకొచ్చింది.
ఢిల్లీ : ఆ మూడు వర్గాల పైన గడచిన నాలుగున్నరేళ్లుగా లేని ప్రేమ… ఒక్కసారి అమాంతం పుట్టుకొచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల సంవత్సరంలో వరాల వాన కురిపించింది. అందరూ ఊహించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ఓటరు ఆకర్షక బడ్జెట్‌తో ముందుకొచ్చింది. ఉద్యోగ, రైతు, శ్రామిక రంగాలకు తాయిలాలు ప్రకటించేసింది.
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. తమ ప్రభుత్వానికి దూరం అవుతున్నారని భావించిన బడుగు, మధ్య తరగతి, రైతాంగంపై వరాలు కురిపించింది. ముందుగా ఊహించినట్టుగానే ఎన్నికల తాయిలాలను తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించింది. కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారిగా బడ్జెట్‌పై ఆయన ప్రసంగించారు. వివిధ వర్గాలను తమ వైపు ఆకర్షితులయ్యేలా బడ్జెట్ రూపకల్పన చేయడంలో ప్రభుత్వం కృతకృత్యమైందనే చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను ఊరిస్తున్న ఆదాయపన్ను పరిమితి పెంపు ఈసారి కార్యరూపం దాల్చింది. రైతులకు మేలు చేయాలని ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్న అభిప్రాయాలకు ఈ బడ్జెట్‌లో చోటు దక్కింది. అసంఘటిత కార్మికులకు కూడా భరోసా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా వేతనజీవులకు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది. వార్షిక ఆదాయం 5లక్షల రూపాయల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 40 వేల నుంచి 50 వేల రూపాయలకు పెంచింది. ఇప్పటి వరకూ రెండున్నర లక్షల రూపాయలుగా ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని ఒక్కసారిగా రెట్టింపు చేయడం ద్వారా ఉద్యోగ వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు కేంద్రం వరాలు కురిపించిందనే చెప్పాలి. ఒక పక్క రైతు శ్రేయస్సు కోసం అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామన్న కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేద రైతులకు ఏడాదికి 6వేల రూపాయల సాయం ప్రకటించింది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తాన్ని కేంద్రం చెల్లించనుంది. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేస్తామని ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై 75వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
అసంఘటిత కార్మికులకు కూడా ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ పథకం ప్రకటించింది. ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పింఛన్ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు 3 వేల రూపాయలు అందనున్నాయి. ఇందుకోసం కార్మికులు నెలకు 100 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమలులోకి రానుంది. మొత్తం మీద ఈ మూడు వర్గాల ఓట్లకు గాలం వేసేలా తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది.