అన్ లాక్ 4.0 : మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం కసరత్తు

  • Published By: venkaiahnaidu ,Published On : September 1, 2020 / 05:48 PM IST
అన్ లాక్ 4.0 : మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం కసరత్తు

Updated On : September 1, 2020 / 6:38 PM IST

ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

రాబోయే రోజుల్లో మరో 100 రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా లాక్​డౌన్​ వల్ల సాధారణ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్దేశించిన కొన్ని మార్గాల్లోనే 230 రైళ్లు నడుస్తుండగా… ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఇండియన్ రైల్వే మార్చి 25 నుండి ప్యాసింజర్, మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసింది. అయితే, లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు మరియు పర్యాటకులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు మే 1 నుండి రైల్వే… శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపడం ప్రారంభించింది. మే 12 నుండి 15 పెయిర్స్(జతల) స్పెషల్ ఎయిర్ కండిషన్డ్ రైళ్లు మరియు జూన్ 1 నుండి 100 పెయిర్స్(జతల) షెడ్యూల్ రైళ్ల కార్యకలాపాలను ప్రారంభించింది.