ఉత్తరాఖండ్ విపత్తు : రూ.4లక్షల పరిహారం..10మృతదేహాలు లభ్యం

Uttarakhand glacier burst ఉత్తరాఖండ్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. ఇక పీఎం సహాయ నిధి నుంచి మోడీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ప్రకటించారు. కాగా, ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్‌రావత్ ..ఘటనాస్థలాన్ని స్వయంగా సందర్శించారు.
అసలేం జరిగింది
ఇవాళ ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద మంచు కొండలు విరిగిపడడంతో పెను ప్రమాదం సంభవించింది. నందాదేవి గ్లేసియర్(మంచు కొండలు) విరిగిపడడంతో ధౌలీ గంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. దీంతో రైనీ గ్రామం తపోవన్ వద్ద ఉన్న రుషిగంగా పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ఒక్కసారిగా నీరు చేరడంతో రుషిగంగా పవర్ ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోయింది. రిషి గంగా పవర్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న సుమారు 150 మంది కార్మికులు ఈ వరదలో కొట్టుకుపోయారు. ఈ వరదలో మొత్తం రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి.
సహాయక చర్యలు
రైనీ గ్రామంలో ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయి. సహాయ చర్యల కోసం చాపర్లు, బలగాలను సైన్యం రంగంలోకి దింపింది. రిషికేశ్‌లోని సైనిక స్థావరాన్ని కేంద్రంగా చేసుకుని… ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్తో కలిసి పనిచేస్తోంది. 600 మంది సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొనేందుకు ఘటనా స్థలికి వెళ్తున్నట్లు భారత సైన్యం అధికార వర్గాలు వెల్లడించాయి. సైన్యం పరంగా సహాయకచర్యలను త్రిదళాధిపతి బిపిన్ రావత్ పర్యవేక్షిస్తున్నారు.
ఉత్తరాఖండ్ విపత్తులో ఇప్పటివరకు 10 మృతదేహాలు లభ్యమైనట్లు ఐటీబీపీ డీజీ దేశ్వాల్ తెలిపారు. నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 250 మంది ఐటీబీపీ సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నట్లు తెలిపారు. తపోవన్ వద్ద సొరంగంలో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ సిబ్బంది రక్షించారు. ఇక,ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగి..సహాయక చర్యల్లో పాల్గొంది.
ఇక ,విష్ణుప్రయాగ్, జోషిమత్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ ప్రాంతాల ప్రజలు నదీ తీరానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భగీరథీ నది ప్రవాహాన్ని నిలివేశారు అధికారులు. అలకనంద నది సాధారణంకన్నా ఒక మీటరు అధిక ఎత్తులో ప్రవహిస్తోన్న నేపథ్యంలో..అలకనంద నది ప్రవాహాన్ని నిలువరించేందుకు శ్రీనగర్, రిషిగంగా ఆనకట్టలను ఖాళీ చేయించారు. అయితే నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోందని చెప్పారు.
విపత్తుపై మోడీ,షా
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్‌తో తాను, హోంమంత్రి, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ విపత్తుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. దేవభూమి అయిన ఉత్తరాఖండ్‌కు కేంద్రం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆ రాష్ట్ర సీఎంకు భరోసా ఇచ్చారు.