రాజకీయ నాయకులకు వ్యాక్సిన్ వేయండి, మేము వేసుకుంటాం

Vaccinate political leaders first : కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై భారతీయుల అభిప్రాయాలు క్రమంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ భారత ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూశాడు. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వేసుకోవడానికి నో చెబుతున్నారు. టీకా వేసుకోవడానికి దాదాపు 60శాతం మంది వెనుకాడుతున్నారు. లోకల్ సర్కిల్స్ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 289 జిల్లాల నుంచి 25వేల మంది పాల్గొన్నారు. ప్రస్తుతం 42శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సర్వేలో మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. రాజకీయ నాయకులు వ్యాక్సిన్ వేసుకుంటే తాము కూడా రెడీ అని 65శాతం మంది చెప్పినట్టు వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధంగా లేకపోయినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా వేసుకుంటే… తాము కూడా సిద్ధమని చెప్పడం ఆసక్తి రేపుతోంది.
నిజానికి అంతర్జాతీయంగా చూస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, క్వీన్ ఎలిజబెత్, యూకే పీఎం బోరిస్, ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు, సౌదీకింగ్ సల్మాన్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకున్నారు. ఇండియాలో మాత్రం ప్రధాని మోదీతోపాటు… ప్రభుత్వాధినేతలు ఎవరూ టీకా వేసుకోవడం లేదు. దీంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. అందుకే రాజకీయ నాయకులు టీకాలు వేసుకుంటే తాము వేసుకోవడానికి సిద్ధమంటున్నారు ప్రజలు.