ప్రాణాలతో చెలగాటం.. రూ.6 కోట్ల లంబోర్ఘినితో యువకుడు వీరంగం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

ఈ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు.

ప్రాణాలతో చెలగాటం.. రూ.6 కోట్ల లంబోర్ఘినితో యువకుడు వీరంగం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

Updated On : June 15, 2025 / 6:00 PM IST

డబ్బుంది కదా అని కొందరు యువకులు రోడ్లను రేస్ ట్రాక్‌లుగా మార్చేస్తున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అత్యంత రద్దీగా ఉండే గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై ఓ యువకుడు దాదాపు రూ.6 కోట్ల విలువైన పసుపు రంగు లంబోర్ఘిని కారుతో ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేశాడు. ఈ వికృత చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

కేవలం 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో.. ఆ యువకుడి నిర్లక్ష్యానికి నిలువుటద్దం పడుతోంది. ఇతర వాహనాలను ప్రమాదకరంగా దాటుతూ, పిచ్చి వేగంతో కారును నడిపాడు. కారు కిటికీలోంచి తల బయటపెట్టి, పెద్దగా అరుస్తూ, తోటి వాహనదారులను అసభ్యకరమైన సైగలతో రెచ్చగొట్టాడు. మరో వాహనంతో రేసింగ్‌కు దిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

గోల్ఫ్ కోర్స్ రోడ్ అనేది లగ్జరీ అపార్ట్‌మెంట్లు, కార్పొరేట్ ఆఫీసులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఆఫీస్ వేళల్లో అయితే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అలాంటి చోట ఈ స్థాయిలో ప్రమాదకరంగా ప్రవర్తించడం అంటే, పాదచారుల, ఇతర వాహనదారుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు రంగంలోకి.. వేట మొదలు

ఈ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. వీడియోలో లంబోర్ఘిని నంబర్ ప్లేట్ పాక్షికంగా కనిపించడంతో, దాని ఆధారంగా వాహన యజమానిని గుర్తించే పనిలో పడ్డారు. యువకుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుని, మోటార్ వాహన చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీని మరింత పెంచుతామని తెలిపారు. ఈ ఘటన డబ్బున్న వారిలో పెరుగుతున్న అహంకారానికి, చట్టాలంటే లెక్కలేనితనానికి నిదర్శనమని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.