Venkaiah Naidu : ఈసారి 75 శాతం ఓటింగ్ పెరగాలి.. ప్రతి ఒక్కరి బాధ్యత : ఉపరాష్ట్రపతి వెంకయ్య

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Venkaiah Naidu : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 75శాతం మేర ఓటింగ్ జరిగేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆయన ఆకాంక్షించారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ సందేశాన్ని ఇచ్చారు. ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరపడంపై ఆయన ప్రస్తావించారు.

ఏకాభిప్రాయ సాధన జరగాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య భారతంలో 2019 ఎన్నికల్లో మహిళ ఓటింగ్ శాతం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక దేశంగా మనం ఆలోచించి మూడు అంచెల సమాఖ్యలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఆ దిశగా దృష్టి సారించి మెరుగైన పాలన దిశగా పయనించాలని వెంకయ్య కోరారు. మన ప్రజల సర్వతోముఖాభివృద్ధి కృషి చేయాలని వెంకయ్య తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల్లో అభ్యర్థులను కూడా వారి యోగ్యత ఆధారంగా ఎన్నుకోవాలని వెంకయ్య సూచించారు. ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన 75ఏళ్లు అవుతున్న సందర్భంగా.. అందరూ ఓటు వేసేలా సంకల్పించుకుందామని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కనీసం 75 శాతానికి ఓటింగ్​ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందామని తెలిపారు. ఓటు హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని వెంకయ్య తన సందేశంలో తెలిపారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటింగ్ అంశంపై ప్రస్తావించారు. ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్​ శాతం నమోదుపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావంతులు, సంపన్న ప్రాంతాలుగా పరిగణిస్తున్న పట్టణాల్లో తక్కువ ఓటింగ్​ శాతం నమోదవు కావడాన్ని ప్రస్తావించారు. 1951-52లో జరిగిన తొలి లోక్​సభ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్​ నమోదైంది.

2019లో కేవలం 67 శాతానికి పెరిగిందని మోదీ గుర్తు చేశారు. భారత్​ వంటి శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంలో ఈ పరిస్థితి మారాలని మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే.

Read Also : Punjab Elections 2022 : ఈ నెల 27న పంజాబ్‌లో రాహుల్ పర్యటన.. నవజ్యోత్ సింగ్ ట్వీట్..

ట్రెండింగ్ వార్తలు