Tamil Nadu Election 2021 : భుజాన పుచ్చకాయతో..నామినేషన్
ఓ అభ్యర్థి పుచ్చకాయను భుజంపై పెట్టుకుని నామినేషన్ వేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

Tamil Nadu
thanjavur constituency : తమిళనాడులో ఎన్నికల ఫీవర్ నెలకొంది. కొద్ది రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి కూడా. మంచి రోజు చూసుకుని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వినూత్నంగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళుతున్నారు. ఓ అభ్యర్థి పుచ్చకాయను భుజంపై పెట్టుకుని నామినేషన్ వేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. తంజావూర్ లో సంతోష్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.
మీడియా దృష్టిని ఆకట్టుకొనేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. తనకు పుచ్చకాయ గుర్తు కేటాయించడంతో..దానిని భుజాన పెట్టుకుని నామినేషన్ వేయడం జరిగిందని సంతోష్ వెల్లడించాడు. ఇదే గుర్తుపై పోటీ చేయడం నాలుగోసారని, మొదటి సారి పోటీ చేసినప్పుడు వంద ఓట్లు, గత ఎన్నికల్లో 400కు పైగా ఓట్లు వచ్చాయన్నారు. ఈసారి పది వేలకు పైగా ఓట్లు వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ప్రజలు మద్దతిస్తే..గెలుస్తానని, స్వతంత్ర అభ్యర్థులతో మార్పు తథ్యమన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తన వద్ద అంత డబ్బు లేదని, అందుకే పుచ్చకాయతో వెళ్లి నామినేషన్ వేసినట్లు సంతోష్ తెలిపారు.