భారత్‌పై శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే వైఖరి ఎలా ఉండబోతుంది.. చైనా ప్రభావం కొనసాగుతుందా..?
దిసనాయకే మార్క్సిస్టు భావజాలం కలిగిన నేత. అతను 1987లో మార్క్సిస్టు ప్రావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ)లో చేరి తన రాజకీయాల్లో అరంగేట్రం చేశాడు.

Anura Kumara Dissanayake
Sri Lankan President Anura Kumara Dissanayake: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠగా సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే పైచేయి సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గుచూపే దిసనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తరువాత శ్రీలంక ఎన్నికల సంఘం 56ఏళ్ల దిసనాయకే అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించింది. దీంతో ఆయన సోమవారం శ్రీలంక 10వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభంతోపాటు చైనా, భారత్ దేశాలతో భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలపై దిసనాయకే వైఖరి ఏ విధంగా ఉండబోతుంది.. గత పాలకుల వలే చైనా వైపు మొగ్గు చూపుతాడా.. భారతదేశంతో బలమైన సంబంధాన్ని పెంపొందించుకుంటారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
Also Read : PM Modi : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
దిసనాయకే మార్క్సిస్టు భావజాలం కలిగిన నేత. అతను 1987లో మార్క్సిస్టు ప్రావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ)లో చేరి తన రాజకీయాల్లో అరంగేట్రం చేశాడు. 1998 నాటికి పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. దిసనాయకే మార్స్కిస్టు భావజాలం కలిగిన నేత కావటంతో గత పాలకులవలే ఆయన ప్రాధాన్యంకూడా చైనావైపే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే, దిసనాయకే పార్టీ నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. చైనాకు అనుకూలంగా శ్రీలంక ఉంటుందన్న భారతదేశ ఆందోళనను తగ్గించే వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు చేశారు. శ్రీలంక నూతన ప్రభుత్వం మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉండదని, మా దేశంలోని భౌగోళిక, రాజకీయ పరిస్థితుల గురించి మాకు పూర్తిగా తెలుసని ఆ పార్టీ ప్రతినిధి బిమల్ రత్నాయకే పేర్కొన్నారు. తద్వారా తాము కేవలం చైనా దేశంతోనేకాక.. భారతదేశంతోనూ సత్సంబంధాలు కలిగి ఉంటామని చెప్పుకొచ్చారు.
దేశం సంక్షోభం నేపథ్యంలో కొలంబో పోర్ట్ సిటీ, హంబన్ తోట పోర్ట్ వంటి వివాదాస్పద ప్రాజెక్టుల ద్వారా భారీ మొత్తంలో రుణాలు పొందేందుకు రాజపక్సే కాలంలో శ్రీలంక చైనా వైపు మొగ్గు చూపింది. చివరికి దేశం రుణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. గత కొన్నేళ్లుగా శ్రీలంకపై చైనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా హంబన్‌తోట పోర్టును చైనా సంస్థకు లీజుకు ఇచ్చింది. 99 సంవత్సరాలు పాటు ఈ పోర్టు చైనా నియంత్రణలో ఉండేలా లీజుకు ఇచ్చింది. ఈ చర్య ఓడరేవును సైనిక అవసరాలకు ఉపయోగించవచ్చుననే భయాన్ని భారత్ లో పెంపొందించింది. అయితే, శ్రీలంక అధికారులు గతంలో ఈ వాదనలు ఖండిస్తూ వచ్చారు.