కేరళలో కొత్త వ్యాధి కలకలం..ఒకరు మృతి

కేరళలో కొత్త వ్యాధి కలకలం..ఒకరు మృతి

Updated On : December 20, 2020 / 4:14 PM IST

shigella infection ఓ వైపు కోవిడ్-19పై అలుపెరుగని పోరాటం చేస్తోన్న కేరళ రాష్ట్రానికి ఇప్పుడు మరో వ్యాధి టెన్షన్ పుట్టిస్తోంది. కరోనా వ్యాప్తి తగ్గకముందే కేరళలో మరో వ్యాధి సంక్రమిస్తోంది. కొజికోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 20 మందికి ‘షిగెల్లా వ్యాధి’ లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. కొట్టంపరంబ, ముందిక్కల్​తాజం ప్రాంతాల్లో 20 మందిలో ఈ కొత్త వ్యాధి లక్షణాలు కనిపించాయని.. ఈ వ్యాధి కారణంగా 11ఏళ్ల బాలుడు మృతిచెందినట్లు తెలిపారు.

జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు. కలుషిత నీరు, పాడైన ఆహారం సేవించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .షిగెల్లా వైరస్​ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్​లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కుగా ఉంటాయి. 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.

వ్యాధి సంక్రమణ దృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు జిల్లా అధికారులు. ఇంటింటికీ తిరిగి వ్యాధి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక బావుల్లో, నీటి కొళాయిల్లో క్లోరినేషన్​ చేయాలని ఆదేశించారు. అంగన్​వాడీ కేంద్రాల ద్వారా ఓఆర్​ఎస్​లు అందించాలని చెప్పారు. కాచిచల్లార్చిన నీరు మాత్రమే తాగాలని… తరచుగా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు వంటలు చేయకూడదని పేర్కొన్నారు. కొజికోడ్ ప్రాంతంలోని నీటి సాంపిల్స్ ​ను పరీక్షించేందుకు ప్రయోగశాలకు పంపినట్లు జిల్లా మెడికల్​ అధికారి (డీఎంఓ) తెలిపారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు