Mahua Moitra : మహువా మొయిత్రా ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?

లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అసలు మహువా నేపథ్యం ఏంటి?

Mahua Moitra

Mahua Moitra : డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మ‌హువా మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ‌హువా మొయిత్రా ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. అసలు ఎవరీ మ‌హువా మొయిత్రా? నేపథ్యం ఏంటి?

Mamata Banerjee : లోక్‌సభ నుంచి ఎంపీ మొహువా మొయిత్రా బహిష్కరణ బీజేపీ ప్రతీకార రాజకీయం : మమతా బెనర్జీ

టీఎంసీ ఎంపీ మ‌హువా మొయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికకు  లోక్‌సభ ఆమోదం తెలపడంతో మ‌హువా మొయిత్రా సభ్యత్వం రద్దు చేసింది. ఈ ఆరోపణలపై సభ లోపల ఆమె వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదు. మరోవైపు ఆమె సభ్యత్వం రద్దు చేయడాన్ని విపక్షాలు వ్యతిరేకించి నిరసన గళం వినిపించాయి. ఈ గందరగోళం మధ్య సభ డిసెంబర్ 11 కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మ‌హువా మొయిత్రా వార్తల్లోకెక్కారు. ఎవరీమె? బ్యాగ్రౌండ్ ఏంటి?

మ‌హువా మొయిత్రా 1974 అక్టోబర్ 12 న అస్సాంలోని కచార్ జిల్లా లాబాక్‌లో జన్మించారు. 1998 లో ఆమె యునైటెడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్ మౌంట్ హోలియోక్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. మ్యాథ్స్, ఎకనామిక్స్‌ చదువుకున్నారు.  అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ JP మోర్గాన్‌లో బ్యాంకర్‌గా పనిచేశారు. మహువా 2009 లో లండన్‌లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Mahua Moitra : టీఎంసీ ఎంపీ మొహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు
2009 కాంగ్రెస్ పార్టీలో చేరిన మహువా 2010 లో మమతా బెనర్జీ నాయకత్వంలోని  తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. 2016 లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణానగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా బీజేపీ అభ్యర్ధి కల్యాణ్ చౌబేపై పోటీ చేసి గెలుపొందారు. 2019 లో లోక్‌సభలో ఎన్డీయేపై విరుచుకుపడుతూ ప్రసంగించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సంవత్సరాలు TMC జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. మహువా ఎక్కువగా టీవీ డిబేట్లలో కనిపించేవారు. 2019 లో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో న్యూస్ ఛానల్ పై అసత్య ఆరోపణలు చేశారన్న అభియోగంపై ఆ ఛానెల్ చీఫ్ మహువాపై పరువు నష్టం దావా వేసారు. కాగా మహువా డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలతో బహిష్కరణకు గురై వార్తల్లో నిలిచారు.