మహారాష్ట్రలో ఓటరు తీర్పు ఎటువైపు

మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకే ప్రజలు పట్టం కట్టారంటూ అంచనాలు వెలువడ్డాయ్. ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అప్పోజిషన్‌కే పరిమితం కాక తప్పదని ఈ పోల్స్ చెప్పాయ్. ఈక్వేషన్స్ చూస్తే..బీజేపీ – శివసేన కూటమి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కన్పిస్తోంది. విపక్ష కాంగ్రెస్ కంటే ముందుగానే ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. తమలో విబేధాలు ఉన్నా సరే కాన్వాసింగ్‌లో మాత్రం ఎక్కడా తగ్గలేదు..బీజేపీ 152 సీట్లు.. శివసేన 124 సీట్లలో పోటీ చేశాయి.
ఓ పన్నెండు సీట్లలో మాత్రమే మిగిలిన మిత్రపక్షాలు పోటీ పడ్డాయి. ఈ ఎన్నికలలోనే శివసేన చీఫ్ కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఎంట్రీ ఇచ్చారు. 288 అసెంబ్లీ సెగ్మెంట్లున్న మహారాష్ట్రలో దాదాపు 61శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 3237మంది అభ్యర్ధులు పోటీ పడగా 8కోట్ల90లక్షలమంది ఓటర్లు 96,691 పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు ఈ ఎన్నికలలో విపక్ష కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్‌తో జట్టు కట్టగా..వంచిత్ బహుజన్ అఘాడీతో ఎంఐఎం జట్టు కట్టింది..ప్రకాష్ అంబేద్కర్‌తో కలిసి ఓవైసీ ప్రచారం చేయగా కాంగ్రెస్ ఈ ప్రచారపర్వంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. శరద్ పవార్ ఒక్కరే తమ పార్టీ అభ్యర్ధుల తరపున ఎక్కువ ప్రచారం చేసారు. కాంగ్రెస్ 145 సీట్లలో ఎన్‌సిపి 123 సీట్లలో పోటీ చేసాయి. వంచిత్ బహుజన్ అఘాడీ మొత్తం సీట్లలో పోటీకి సిధ్దపడినా..ముస్లిం డామినేషన్ ఏరియాల్లో ఎంఐఎంకి మద్దతిచ్చేలా లోపాయికారీ ఒప్పందం కుదిరింది. ఎంఐఎం 44 సీట్లలో పోటీకి అభ్యర్ధులను నిలిపింది.
> మహారాష్ట్ర నవనిర్మాణసేన ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోయినా..103 సీట్లలో పోటీకి దిగింది. బీజేపీ – శివసేన పార్టీలకు 204 సీట్లు దక్కుతాయని ఏబిపి సీ ఓటర్ సర్వే చెప్తోంది కాంగ్రెస్‌కి మాత్రం 69 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది.
> టైమ్స్ నౌ కూడా 288 సీట్లలో బీజేపీ – శివసేన కూటమి 230 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని చెప్పగా..కాంగ్రెస్ 48 సీట్లకి పరిమితమవుతుందని తేల్చింది..ఇతరులకి 10 సీట్లు దక్కవచ్చని టౌమ్స్ నౌ చెప్తోంది.
> అలానే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం బీజేపీ – శివసేన కూటమికి 181 సీట్లు మాత్రమే దక్కుతాయంటోంది. కాంగ్రెస్‌కి 81, ఇతరులు 24 సీట్లు గెలుచుకుంటాయని చెప్తోంది.
> సిఎన్ఎన్ న్యూస్ 18 మాత్రం బీజేపీ కూటమికి ఏకంగా 243 సీట్లు దక్కుతాయని కాంగ్రెస్ 41 సీట్లకే పరిమితం అవుతుందని చెప్తోంది. ఇతరులు నాలుగు సీట్లకే పరిమితమవుతారని సిఎన్ఎన్ న్యూస్ 18 చెప్పింది. మరి ఓటరు ఎవరికి పట్టం కడుతారో తెలుసుకోవాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.
Read More : ప్రభుత్వం ఆదేశం : రాత్రి 8 నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చాలి