Freebies: ఉచిత పథకాలు లేకపోతే ఎన్నికల్లో గెలవలేరా.. అసలెందుకీ పరిస్థితి?

ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో ఉచిత పథకాల జాతర మొదలైంది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలూ ఉచిత పథకాలను సానబెడుతున్నాయి.

Freebies: ఉచిత పథకాలు లేకపోతే ఎన్నికల్లో గెలవలేరా.. అసలెందుకీ పరిస్థితి?

why political parties depend on freebie to win in elections

Updated On : August 29, 2023 / 1:05 PM IST

Freebies- Elections: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఆల్ ఫ్రీ… బస్సు ప్రయాణం ఫ్రీ.. కరెంటు ఫ్రీ.. వాటర్ ఫ్రీ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలూ ఉచిత మంత్రమే జపిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు (political parties) అన్నింటిదీ ఒకటే జపం.. ఆల్ ఫ్రీ (All Free) మంత్రం.. ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ఖజానాను ఖాళీ చేయడంపైనే పార్టీలు దృష్టిపెడుతున్నాయి. ఉత్పాదకతను పెంచడం, శ్రామిక శక్తిని వినియోగించడంపై ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలు చేయడమే పనిగా మారిపోయింది. ఏ ఒక్క రాష్ట్రానికో ఇది పరిమితం కాదు.. ఎన్నికలు జరగనున్న తెలంగాణయే కాదు.. ఆ తర్వాత ఎన్నికలు ఎదుర్కొనే ఏపీతో సహా చాలా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఉచిత పథకాలనే ఓట్లు కురిపించే ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. అసలెందుకీ పరిస్థితి? ఉచిత పథకాలు లేకపోతే ఎన్నికల్లో గెలవలేరా?

ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో ఉచిత పథకాల జాతర మొదలైంది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలూ ఉచిత పథకాలను సానబెడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరిని మించి మరొకరు ఆల్ ఫ్రీ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపుతున్న పథకాలను ఏ పార్టీ వ్యతిరేకించలేని పరిస్థితిలో ప్రతి పార్టీ ఉచిత పథకాలే ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాల్సివస్తోంది. సంక్షేమం పేరుతో అడ్డూ అదుపు లేకుండా హద్దులు దాటి ఉచిత పథకాలు అందజేస్తుండటంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. కానీ ఓట్ల రాజకీయంలో ఏ ఒక్కరూ ఈ ఉచితాల పోటీ నుంచి తప్పుకోలేకపోతున్నారు.

దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఉచిత పథకాల హవా మొదలైంది. ఈ మధ్య కాలంలో మరింతగా విస్తరించాయి ఉచిత పథకాలు.. ఏవి సంక్షేమ పథకాలో.. ఏవి ఉచిత పథకాలో గుర్తించలేని స్థితికి చేరుకున్న పార్టీలు.. ఖజానాపై పెను భారం మోపే పథకాలకు రూపకల్పన చేస్తున్నాయి. ఉచిత విద్య, వైద్యం, ఉచిత ఎరువులు కచ్చితంగా అమలు చేయాల్సిన పథకాలు.. వాటికి అదనంగా అవసరం లేని హామీలు ఇస్తూ ప్రభుత్వాలను అప్పుల ఊబిలోకి దించేస్తున్నాయి పార్టీలు. చివరికి ఉచిత పథకాలకు వ్యతిరేకమైన బీజేపీ కూడా ఆ రొంపిలోకి దిగక తప్పలేదు. దేశంలో ఉచిత పథకాలు అవసరమా? అని గత ఏడాది ప్రధాని మోదీ ప్రశ్నించారు. బీజేపీ నాయకుడొకరు సుప్రీంకోర్టులో కేసు వేసి ఆసక్తికర చర్చకు తెరతీశారు. కానీ చివరకు అదే బీజేపీ.. మూడు నెలల కిందట జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వాల్సివచ్చింది. కర్ణాటకలో పోటాపోటీగా ఇచ్చిన ఉచిత హామీలతో కాంగ్రెస్ విజయం సాధించింది.

Also Read: మొదటిసారి ప్రధాని రేసులో మోదీని దాటేసిన రాహుల్.. సర్వేలో చాలా చిత్రమైన అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రజలు

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీలిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపలేక అష్టకష్టాలు పడుతోందని చెబుతున్నారు. మహిళలు అందరికీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మహిళలకు, నిరుద్యోగులకు నెలనెలా ఆర్థిక సాయం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో కర్ణాటక బడ్జెట్‌పై తీవ్ర భారం పడుతోంది. అంతేకాదు అన్నీ ఉచితంగా లభిస్తుండటంతో ఆ రాష్ట్రంలో కూలి పనులు చేయడానికి కూలీలు ఎవరూ దొరకడం లేదు. ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే చిల్లర సాయానికి అలవాటు పడిన కూలీలు.. కాఫీ ఎస్టేట్లలో పనులకు పిలిస్తే రోజుకు 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 8 గంటలే పనిచేస్తామనే కండీషన్లు పెడుతున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులు మరికొన్నాళ్లు కొనసాగితే కాఫీ పండించడం చాలా కష్టమవుతోందని అంటున్నారు రైతులు.

Also Read: రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమత బెనర్జీ.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు?

ఒక్క కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. యూపీఏ గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం.. అప్పట్లో కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించినా.. తర్వాత కాలంలో రైతుల పాలిట శాపంగా మారింది. ఏడాదిలో 120 నుంచి 150 రోజులు పని కల్పించే ఉపాధి పథకం.. గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరతను సృష్టించింది. ఎవరికి వారు ఆయా గ్రామాల్లో ఉండిపోవడం.. పని ఉన్నా… పక్క గ్రామానికి వెళ్లేందుకు సైతం నచ్చకపోవడంతో వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు ఉచితంగా సాయం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు.. రైతుపై పడుతున్న భారం తగ్గించే పథకాలను మాత్రం తేలేకపోతున్నాయి.

Also Read: కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల దోస్తీపై సస్పెన్స్.. తెలంగాణలో ఆసక్తికరంగా పొత్తు రాజకీయం

మరోమూడు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగున్నాయి.. ఈ ఎన్నికల్లో లబ్ధి కోసం అధికార బీఆర్‌ఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని స్కీమ్‌లను తెస్తోంది. ప్రస్తుతం వృద్ధ్యాప్య పింఛన్లకు రెండు వేల రూపాయలిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేలు చేస్తామని హామీ ఇస్తోంది. అలా ఐతే మేము ఐదు వేలు చేస్తామని సీఎం కేసీఆర్ ఆ మధ్య ప్రకటించారు. వేలంపాట మాదిరిగా సంక్షేమం, ఉచిత పథకాల్లో నజరానాలు ప్రకటిస్తూ పోటీపడుతున్నారు నేతలు. ఇక ఏపీలో కూడా ఇదే విధమైన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడి అధికార పార్టీ సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. ఇక అధికార పార్టీకి పోటీగా ప్రతిపక్ష పార్టీ సైతం ఉచిత సంక్షేమ పథకాల పందేరానికి తెరతీసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మరిన్ని జోడించి ఇప్పటికే తొలివిడత మ్యానిఫెస్టో విడుదల చేసింది టీడీపీ.. ఇప్పటికే విభజనతో కుదేలైన ఏపీపై అప్పుల భారం కొండలా పెరిగిపోయింది. ఖజానాలో డబ్బు లేకుండా, ఆదాయం వచ్చే మార్గాలను చూడకుండా ఉచిత పథకాలను ప్రవేశపెట్టడాన్ని ఏమనాలి?

Also Read: గన్నవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు.. ప్లాన్ మార్చిన వైసీపీ!

ఇలా ఉచిత పథకాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మన పక్కనే ఉన్న మరో రాష్ట్రం తమిళనాడు ఉచిత పథకాలకు పెట్టింది పేరు. ప్రతి ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో వింత హామీలు కనిపిస్తుంటాయి. ఉచిత టీవీలు, లాప్‌టాప్‌లు, సైకిళ్లు ఇలా ప్రజాకర్షణే ధ్యేయంగా ప్రజాదనం ఖర్చు చేస్తుంటాయి పార్టీలు. ఇక ఆదర్శపాలన చేస్తామంటూ ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ఉచిత పథకాలనే ఆశ్రయించింది. పంజాబ్‌లో గద్దె నెక్కేందుకు ఎన్నో ఉచిత పథకాలను ప్రకటించిన ఆప్.. ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు అప్పులు చేస్తోంది. కేంద్రం సాయం కోసం చూస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత పథకాలకు మినహాయింపేమీ కాదు. రాష్ట్రాల్లో ప్రజాదనం వృథాగా ఖర్చు చేయకుండా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా.. ఎన్నికల పోటీలో నెగ్గేందుకు ఉచిత పథకాలనే ఆశ్రయిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని కూడా పట్టించుకోకుండా ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి.. విపరీతంగా అప్పులు చేస్తూ.. ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటూ భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నాయి.