ఆ పార్టీ వాళ్లను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతా!

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతలను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతానని అన్నారు మహిళా బీజేపీ నేత. బీజేపీ కార్యకర్తలను తృణమూల్ నేతలు వేధిస్తున్నారని ఆరోపించిన ఘటల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ భారతీ ఘోష్.. ఇదే పరిస్థితి కొనసాగితే తృణమూల్ నేతలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆనందపూర్ ప్రాంతంలో తృణమూల్ కార్యకర్తల దాడిలో గాయపడినట్టు చెబుతున్న కొందరిని పరామర్శించిన భారతి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఓట్లు వేయవద్దంటూ ప్రజలను బెదిరిస్తారా? బెదిరించనివ్వండి. నేను కూడా వాళ్లని ఇళ్లలో నుంచి బయటికి లాక్కొచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడతా. వాళ్లు ఏది ఇస్తే అంతకు రెట్టింపు వడ్డీతో కలిపి చెల్లిస్తా..’’ అంటూ ఆమె తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వేలాది మందిని తీసుకొచ్చి, టీఎంసీ కార్యకర్తలను కొట్టిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు తృణమూల్ పార్టీ కార్యకర్తలంతా ఇళ్లలోకి వెళ్లి తాళాలు వేసుకోవాల్సి వస్తుందన్నారు.