హామీ ఇస్తున్నా…బయటివ్యక్తులను అసోంలోకి అనుమతిచం

  • Published By: venkaiahnaidu ,Published On : February 8, 2020 / 12:19 AM IST
హామీ ఇస్తున్నా…బయటివ్యక్తులను అసోంలోకి అనుమతిచం

Updated On : February 8, 2020 / 12:19 AM IST

పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం తొలిసారి ప్రధానమంత్రి మోడీ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)అసోంలో అడుగుపెట్టారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల శాంతి, అభివృద్ధి కోసం కలిసిపనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అస్సాంలోని బోడోల్యాండ్‌ ఉద్యమ సంస్థలతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం రాష్ట్రంలో శాశ్వత శాంతికి పునాదులు వేస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

బోడో శాంతి ఒప్పందం 21వ శతాబ్దంలో అస్సాం సహా మొత్తం ఈశాన్య ప్రాంతానికే ఒక నూతన ప్రారంభం అని మోడీ అన్నారు. బోడో ఒప్పందం ద్వారా శాంతి, అహింస విజయం సాధించాయనీ అది ప్రజల వల్లే సాధ్యమైందనీ మోడీ అన్నారు. బోడోయేతరుల ఆందోళనల నేపథ్యంలో ఒప్పందంలోని 6వ నిబంధనను అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తిరిగి హింసను ఆమోదించేది లేదని మోడీ స్పష్టం చేశారు. కశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాల్లో ఇప్పటికీ తుపాకులు, బుల్లెట్లు, బాంబులు కలిగి ఉన్న వాళ్లు, నక్సల్స్‌ తిరిగి జనస్రవంతిలోకి రావాలి. తమ జీవితాన్ని ఆస్వాదించాలని మోడీ పిలుపునిచ్చారు.

సీఏఏ అమలు నేపథ్యంలో ఇతర దేశస్థులు భారీగా వలస వస్తారని దుష్ప్రచారం జరిగిందని, అయితే అలాంటిదేమీ జరుగలేదని మోడీ తెలిపారు. అసోం యొక్క స్థానిక ప్రజల బాష,గుర్తింపు,సంస్కృతి కాపాడేందకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోడీ అసోం ప్రజలకు ప్రామిస్ చేశారు. అసోం వ్యతిరేక,దేశ వ్యతిరేక మనస్థత్వాన్ని సహించేది లేదని,బయటివ్యక్తులను అసోంలో సెటిల్ అయ్యేందుకు అనుమతించబోమని తాను హామీ ఇస్తున్నానని మోడీ అన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా అసోంలో తీవ్రస్థాయిలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన రెండుసార్లు వాయిదా పడింది. గౌహతిలో గత ఏడాది డిసెంబర్‌లో జపాన్‌ ప్రధానితో జరుగాల్సిన సదస్సు వాయిదా పడగా, జనవరిలో ‘ఖేలో ఇండియా’ క్రీడల ప్రారంభోత్సవానికి మోడీ హాజరుకాలేదు. సీఏఏ అమలు తర్వాత తొలిసారి శుక్రవారం మోడీ అసోంలో పర్యటిచారు.