Say “No” to Tobacco: సరదాగా మొదలై.. వ్యసనంగా మారి.. ప్రాణాలు తీస్తుంది

ప్రపంచం మొత్తం మీద ఆరోగ్యంగా ఉండడం అనేది.. ఇప్పుడు ఓ పెద్ద సవాల్.. రోజువారీ అలవాట్లు.. చేసే పనులే మన శరీరంలో మార్పులను చూపిస్తున్నాయి. మానవాళి జీవితంలో పొగాకు ప్రమాదం ఎక్కువ అయ్యింది.

Say “No” to Tobacco: సరదాగా మొదలై.. వ్యసనంగా మారి.. ప్రాణాలు తీస్తుంది

Say “no” To Tobacco

Updated On : May 31, 2021 / 1:23 PM IST

World No Tobacco Day 2021: ప్రపంచం మొత్తం మీద ఆరోగ్యంగా ఉండడం అనేది.. ఇప్పుడు ఓ పెద్ద సవాల్.. రోజువారీ అలవాట్లు.. చేసే పనులే మన శరీరంలో మార్పులను చూపిస్తున్నాయి. మానవాళి జీవితంలో పొగాకు ప్రమాదం ఎక్కువ అయ్యింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు(31 మే 2021)న వరల్డ్ నో టొబాకో డే(World No Tobacco Day)గా జరుపుకుంటున్నాం. కాల్చినా, నమిలినా, పొగ పీల్చినా హానిచేసే ఉత్పత్తి పొగాకు(Tobacco). పొగాకు వల్ల వచ్చే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు చాలా ఎక్కువ.

‘భారత ప్రజారోగ్య ఫౌండేషన్ (పీహెచ్ఎఫ్ఐ) ‘ అంచనాల ప్రకారం, పొగాకు అలవాటు కారణంగా ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతూ ఉండగా.. 4.9 మిలియన్ మరణాలు ఇదే కారణంగా సంభవిస్తున్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలో 10.9 శాతం మంది ఏదో రూపంలో పొగాకు తీసుకుంటున్నారు. ఇందులో 82 శాతం మంది దీనివల్ల సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారు. 9 లక్షల మంది ప్రతి ఏటా చనిపోతూ ఉన్నారు. 90 శాతం ఊపిరితిత్తుల కేన్సర్లకు పొగ తాగడమే కారణం అవ్వగా.. 35 శాతం నోటి క్యాన్సర్లు పొగాకు నమలడం ద్వారా వస్తున్నాయి.

పొగతాగే వారే కాదు.. పీల్చడం వల్ల కూడా కుటుంబంలో ఇతరులకు ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అనేక సంధర్భాల్లో వివరించారు. మిగతా వారితో పోల్చితే పొగాకు అలవాటున్న వారిలో 2-3 రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పాశ్చాత్య ప్రభావం, ప్రపంచీకరణ ఫలితంగా మహిళల్లోనూ ఈ అలవాటు రోజురోజుకు పెరుగుతున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. సరదాగా మొదలై.. అలవాటుగా మారి.. వ్యసనమై ప్రాణాలను తీస్తుంది. పాతికేళ్లకే ప్రాణాంతక క్యాన్సర్లు భారిన పడుతున్నారు.

అంతేకాదు.. పొగాకు తీసుకునేవారిలో కరోనా పెరిగే శాతం ఎక్కువగా ఉందని, World No Tobacco Day 2021 సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయోసస్ వెల్లడించారు. కరోనా వైరస్ భారిన పడకుండా ఉండాలంటే.. స్మోకింగ్ మానేయడం తప్పనిసరి అని, తద్వారా కరోనాపై పోరాటాన్ని సైతం ముమ్మరం చేయవచ్చునని చెబుతున్నారు నిపుణులు.