ఢిల్లీ ఎన్నికల్లో మీకు నచ్చిన పార్టీకి రహాస్యంగా నిధులు ఇవ్వొచ్చు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెలలోనే దేశ రాజధానిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో మీకు నచ్చిన పార్టీకి నిధులు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. అది కూడా రహాస్యంగా నిధులు ఇవ్వొచ్చు. నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్ విధానం 2018 ప్రకారం.. ఏ పార్టీకైనా విరాళాలను ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఇవ్వొచ్చు. ఎన్నికలకు ఇంకా 10 రోజులు ముందుగానే ఎలక్ట్రోరల్ బాండ్ల సేల్స్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ బాండ్స్ ద్వారా పార్టీలకు విరాళమిచ్చే దాత వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 2017 ఫైనాన్స్ చట్టం ద్వారా ఎన్నికల బాండ్ల స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది. 2018 జనవరి 2వ తేదీన ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది. ఎన్నికల వ్యయ ప్రక్షాళన కోసమే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఎలక్ట్రోరల్ బాండ్ ప్రామిసరీ నోటు తరహాలో ఉంటుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఈ బాండ్లను పొందొచ్చు. దేశ పౌరుడు లేదా దేశంలో నమోదైన ఏదైనా సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు.
ఎన్నికల సమయంలోనే :
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ సేల్ ప్రారంభమైంది. ఈ ఏడాదిలో మార్చి, ఏప్రిల్ రెండు నెలల్లోనే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేసిన సీక్రెటీవ్ బాండ్ల ద్వారా రూ.3వేల 622 కోట్లు మేర నిధులు రాజకీయా పార్టీలకు అందాయి. మార్చిలో రూ.1365.69 కోట్ల బాండ్లను ఎస్బీఐ జారీ చేసింది. అది ఏప్రిల్ నెలలో 65శాతం మేర పెరిగి రూ.2256.37 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో మార్చి 10న పార్లమెంటరీ ఎన్నికలు ప్రకటన వెలువడగా, ఏప్రిల్ 11 ఓటింగ్ ప్రారంభమైంది.
బాండ్ల కొనుగోలు :
రాజకీయ పార్టీల్లో నగదు రహిత నిధులను సమకూర్చేందుకు వీలుగా ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు అపరిమిత విరాళాలను దేశంలోని లేదా విదేశీ కంపెనీల నుంచి పొందవచ్చు. ఈ విరాళాలపై లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అంతా రహాస్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరు విరాళం ఇచ్చారు.. ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారు.. ఎంత ఇచ్చారు అనేదానిపై కూడా గోప్యతగా ఉంచుతారు. ఈ పథకాన్ని అప్పట్లో ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎలక్ట్రోరల్ బాండ్ పథకాన్ని ప్రజా సంఘాలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పలు పార్టీలు సుప్రీంకోర్టులో దీనిపై సవాల్ చేశాయి.
కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా తప్పుబట్టింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు కూడా తన అభ్యంతరాన్ని తెలిపింది. దీని ఫలితంగా రాజకీయ వ్యవస్థలో పారదర్శకత పూర్తిగా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బాండ్ల స్కీమ్ ను నిలిపివేయాలంటూ ప్రజాస్వామ్య సంస్కరణల అసొసియేషన్ సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై ఈ నెలలో సుప్రీం విచారించే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర సమాచార కమిషన్ కూడా ఈ నెలలోనే బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన వ్యక్తులు, ఆయా సంస్థల పేర్లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది.
లబ్దిదారుల్లో బీజేపీనే ఫస్ట్ :
ఈ ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ నుంచి పెద్ద మొత్తంలో లబ్ది చేకూరింది బీజేపీ లబ్దిదారులకేనని ఓ రిపోర్టు వెల్లడించింది. 2017-18లో బాండ్ల రూపంలో బీజేపీ 94.5 శాతంతో రూ.210 కోట్ల నిధులను అందుకుంది. ఇతర పార్టీలన్నీ కలిసి కేవలం రూ.11కోట్లు మాత్రమే విరాళాలను పొందాయి. 2018లో ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా రూ.2,410 కోట్లకు రూ.1,450 కోట్లను విరాళాలను కాషాయ పార్టీ అందుకుంది.
ఈ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ రూ. 383 కోట్లను విరాళంగా పొందింది. గత రెండేళ్లలో దాదాపు రూ. 6వేల కోట్ల విలువైన 11,770 బాండ్లు అమ్ముడయ్యాయి. వాటిలో 5,463 (92శాతం) రూ .1 కోట్ల నిధుల విలువ కలిగి ఉన్నట్టు నివేదిక పేర్కొంది.