చంద్రబాబుకి షాక్ : జగన్ తో టచ్‌లో 17మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఒక్క పార్టీపై రెండు పార్టీల కన్ను. ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయం.. అందరూ మా పార్టీలోకి దూకేయడమూ పక్కా అని ఆ రెండు పార్టీలు అంటాయి. నిజానికి ఆ పార్టీ ఖాళీ కాబోతోందా? ఆ ఎమ్మెల్యేలంతా పక్కాగా దూకేయబోతున్నారా? దూకితే ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీలోకి? ఇక్కడే అసలు సిసలు మైండ్ గేమ్ కనిపిస్తోంది. ఒక పార్టీ ఇప్పటికే ఆ ఆట ఆడేసి ఫెయిల్ కాగా.. రెండో పార్టీ ఇప్పుడే ఆట మొదలుపెట్టింది. మరి ఈ పార్టీ చెబుతున్నట్టుగా జరుగుతుందా? పొలిటికల్ మైండ్ గేమ్‌గా మిగిలిపోతుందా?
టచ్‌లో ఉన్న ఆ 17 మంది ఎవరు?
ఏపీలో వైసీపీ మైండ్ గేమ్ మొదలు పెట్టిందంటున్నారు. టీడీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మొన్నా మధ్య పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. తమతో 17 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, గేట్లు తెరిస్తే చాలు వచ్చి చేరిపోతారని చెబుతున్నారు. కాకపోతే 17 మంది ఎమ్మెల్యేలు అంటే.. ఇప్పటికే వైసీపీకి దగ్గరగా ఉంటున్న వల్లభనేని వంశీ, మద్దాలి గిరిని కలుపుకొని చెబుతున్నారా.. వారు కాకుండా మరో 17 మంది అన్నదా లెక్క తేలడం లేదు. వారిద్దరిని పక్కన పెడితే ఇప్పుడు టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో చంద్రబాబు, బాలకృష్ణలు కాకుండా మిగిలిన 19 మందిలో 17 మంది వెళ్లిపోతే మిగిలే ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఇలాంటి మైండ్ గేమ్ ఆడి విఫలమైన బీజేపీ:
మరోపక్క, గతంలో బీజేపీ కూడా ఇలాంటి మైండ్ గేమ్‌నే టీడీపీ విషయంలో ఆడింది. అప్పట్లో చాలా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు ప్రకటనలు గుప్పించారు. కానీ, నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రం తమ అవసరార్థం వెళ్లిపోయారే తప్ప.. ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ వైపు మొగ్గు చూపించ లేదు. ఆ తర్వాత చాలా కాలం పాటు అలాంటి ప్రకటనలే బీజేపీ నేతలు కొనసాగించినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీకి దూరం అయ్యారు. వారిద్దరూ కూడా వైసీపీకి దగ్గరయ్యారు తప్ప.. బీజేపీ వైపు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ మైండ్ గేమ్ పూర్తిగా ఫెయిల్ అయిందంటున్నారు. ఇప్పుడు కొత్తగా అధికార వైసీపీ ఈ గేమ్ మొదలుపెట్టింది.
151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీకి కొత్త వారు అవసరమా?
మండలిలో తాను అనుకున్నది సాధించలేకపోవడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. అందుకే శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదే సమయంలో 17మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వైసీపీ నేతలు ప్రకటనలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. వాస్తవానికి ఆ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే రావాలని జగన్ అంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నా.. జగన్ నుంచి సరైన భరోసా లభించకపోవడంతో వెనుకంజ వేస్తున్నారట. అదే సమయంలో ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు వారంతా సిద్ధపడడం లేదంట.
టీడీపీని దెబ్బకొట్టడమే వైసీపీ లక్ష్యమా?
ఈ పరిస్థితుల్లో మరోసారి టీడీపీని తన మైండ్ గేమ్‌తో ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ సిద్ధమైందంటున్నారు. శాసనమండలిలో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీని కోలుకోకుండా చేయాలన్నదే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే 17 మంది ఎమ్మెల్యేల పాట అందుకుందంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే వారంతా గ్రూపుగా ఒకేసారి వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఫిరాయింపు చట్టం వర్తించదు. అప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా రాదనేది వ్యూహంగా కనిపిస్తోందని అనుకుంటున్నారు. టీడీపీలో చంద్రబాబు, బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరితో పాటు పార్టీలో ఉండిపోయే ఆ నాలుగో వ్యక్తి ఎవరన్న చర్చ సాగుతోంది. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మాత్రమే చంద్రబాబుకు అండగా ఇప్పుడు గట్టిగా నిలబడుతున్నారు. మరి వీరిద్దరిలో వైసీపీతో టచ్‌లో ఉన్నదెవరనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోందట.
టచ్ లో ఉన్నది నిజమేనా?
నిజంగానే వైసీపీతో అంత మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉందంటుని అంటున్నారు. అంత మంది కాకపోయినా నలుగురైదుగురు అయితే కచ్చితంగా ఉన్నారని చెబుతున్నారు. గతం నుంచి వైసీపీతో టచ్‌లో ఉన్నారంటున్న వారు కాకుండా కొత్తగా ఎంత మంది అటు చూస్తున్నారనే దానిపై అటు టీడీపీలోనూ, ఇటు వైసీపీలోనూ చర్చ సాగుతోంది. ఇది వాస్తవమో? బీజేపీ తరహాలో ఫెయిల్యూర్ గేమ్ ప్లానో అన్నది తేలాలంటే మాత్రం కొద్ది కాలం వేచి చూడాలని జనాలు అంటున్నారు.