అమరావతి: ఏపీలో 2వేల రూపాయల నోటు కనబడుట లేదు. అవును నిజమే. బ్యాంకులు, ఏటీఎంల్లోనే కాదు వ్యాపారుల దగ్గర కూడా 2వేల రూపాయల నోటు జాడ లేదట. 2వేల రూపాయల నోటు కనపడి 6నెలలు అవుతోందంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ 2వేల రూపాయల నోటుకు ఏమైంది. ఎవరు మాయం చేశారు. ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీల నుంచి ప్రజల వరకూ అందరూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే.. రాజకీయ నాయకులు జాగ్రత్త పడ్డారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు 2 వేల రూపాయల నోటును కిడ్నాప్ చేశారు. పెద్ద మొత్తంలో 2వేల రూపాయల నోట్లను పోగు చేసి.. తమ గిడ్డంగుల్లో కట్టిపడేశారు.
Read Also : రూ.2వేల నోటు కోసం ప్రాణాలతో చెలగాటం
ఎన్నికల సమయం కావడంతో రూ.2 వేల నోట్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈసారి అభ్యర్థుల ఎన్నికల వ్యయం కూడా పెరగబోతోంది. ఎన్నికల వేళ ఓటర్లను లొంగదీసుకునేందుకు 5వేల రూపాయలు ఇచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని టీడీపీ, వైసీపీ అధినేతలే ప్రచారసభల్లో ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఓటర్లు కూడా అదే స్థాయిలో ఆశిస్తున్నారు. మరీ అంత కాకపోయినా కనీసం ఓటుకు రూ.2 వేల నోటు దక్కుతుందని కొందరు ఎదురు చూస్తున్నారు. ఆయా పార్టీల నేతలు కూడా డబ్బు పంపిణీకి రెడీ అయ్యారు. 2వేల రూపాయల నోటును 6 నెలల నుంచే దాయడం మొదలుపెట్టారు. బ్యాంకులు, ఏటీఎమ్ లలో కూడా రూ.2 వేల నోటు చెలామణి తగ్గిపోయింది.
ఏపీలో 2వేల నోటుకు బాగా గిరాకీ పెరిగింది. 500, 200, 100, 50 రూపాయల నోట్లన్నీ 2 వేల రూపాయలు నోట్లుగా మారిపోయాయి. ఎన్నికల్లో డబ్బును పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి దాదాపు అన్నీ పార్టీలు సిద్ధమయ్యాయనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్లమెంట్ పరిధిలో రూ.100 కోట్లు, అసెంబ్లీ పరిధిలో 30 నుంచి 50 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు.
ఇప్పటికే నగదంతా సమకూర్చుకున్నారు. ఐటీ దాడుల భయంతో ఆయా జిల్లాల్లో అభ్యర్థులు తమ అనుచరులు, నమ్మకస్తుల దగ్గర నగదు దాచినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నియోజకవర్గాలకు క్షేత్రస్థాయిలో డబ్బును తరలించే అవకాశముంది. ఎక్కువమంది రూ.2 వేల నోటుకోసం పోటీ పడటంతో.. సామాన్య ప్రజల కంటికి 2వేల రూపాయల నోటు కనిపించకుండా పోయింది.
2వేల రూపాయల నోటు అందుబాటులో లేకపోవడంతో.. రూ.500, రూ.200ల నోట్లను సమకూర్చే పనిలో నేతలున్నారు. చిన్న నోట్లు కావడం, ఎక్కువ మొత్తంలో దాచడం కష్టసాధ్యమవుతోంది. దీంతో అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు.
Read Also : గెలుపోటముల్లో 5శాతం ఇంపాక్ట్ : అభ్యర్థుల రాతను డిసైడ్ చేస్తున్న సోషల్ మీడియా