సీన్ రిపీట్ : ఒకే గూటికి వంగవీటి, దేవినేని కుటుంబాలు

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 08:22 AM IST
సీన్ రిపీట్ : ఒకే గూటికి వంగవీటి, దేవినేని కుటుంబాలు

Updated On : January 23, 2019 / 8:22 AM IST

విజయవాడ: వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. దీంతో.. ఇప్పుడు బెజవాడ రాజకీయాలు ఆసక్తిగా మారిపోయాయి. కారణం.. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు.

 

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లే.. బద్ధవైరం ఉన్న ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉండటం కూడా కష్టమనే సామెత రాజకీయంగా ఉంది. కానీ.. సమీకరణాలను బట్టి రాజకీయంగా… సామాజికంగా… వ్యక్తిగతంగా వ్యతిరేకించుకున్న నేతలు… ఒక్కోసారి ఒకే పార్టీలో ఉండాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. విజయవాడలో సామాజిక వర్గాల పరంగా.. రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉన్న వంగవీటి రాధా… దేవినేని నెహ్రూ కుటుంబాలు ఇప్పుడు ఒకే పార్టీలో మరోసారి కలవబోతున్నాయి. ఇంతకు ముందు ఓసారి కాంగ్రెస్‌లో ఉన్న ఈ కుటుంబాల నేతలు… మరికొన్ని రోజుల్లో టీడీపీలో కొనసాగనున్నారు.

 

4 దశాబ్ధాల కింద రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. దీంతో… బెజవాడలో వంగవీటి రంగా వర్సెస్ దేవినేని నెహ్రూ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఈ రెండు కుటుంబాల మధ్య ఉండేది. రంగా హత్య తర్వాత బెజవాడ రాజకీయాలు మారిపోయాయి. రంగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన ఆయన కుమారుడు రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు టీడీపీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన దేవినేని నెహ్రూ.. సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ గొడుకు కిందకు వచ్చాయి. అయినా వారిద్దరూ మర్యాదపూర్వకంగానైనా మాట్లాడుకునే వారు కాదు.

 

2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధా… ఆ తర్వాత జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతినడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ… కొద్దిరోజులకే గుండెపోటుతో మరణించారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయన కుమారుడు దేవినేని అవినాశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు.

 

అవినాశ్‌తో పోలిస్తే బెజవాడ, కోస్తాలో విపరీతమైన ఫాలోయింగ్, రాజకీయ అనుభవం, తన సామాజిక వర్గంలో పలుకుబడి ఉండటం వంగవీటి రాధాకు ప్లస్‌. దీంతో రాధా ముందు అవినాశ్ నిలబడటం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ , లేదంటే ఎమ్మెల్సీ పదవి ఖాయమని వార్తలు వస్తుంటే… అవినాశ్‌కు మాత్రం ఆ గ్యారెంటీ లేకుండాపోయింది. మొత్తం మీద వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరబోతుండటం.. బెజవాడ రాజకీయాల్లో మరోసారి కదలిక తెచ్చిందని చెప్పవచ్చు.