రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

  • Publish Date - March 31, 2020 / 11:09 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి.  దీని ప్రభావం రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్ధపై పడింది.

ఇప్పటికే తెలంగాణ సీఎం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 2 విడతలుగా చెల్లిస్తామని చెప్పినట్లు  ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ  తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన దగ్గరున్న నిధులను కరోనా వైరస్  నిరోధానికి ఖర్చు పెడుతోంది. అందుకని ఉద్యోగులకు మొదట సగం జీతం ఇచ్చి, ఆ తరువాత నిధులు సమాకూరిన  తర్వాత మిగతా జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  దీనికి ఉద్యోగసంఘాల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. 

తెలంగాణ లో ఉద్యోగుల హోదాను బట్టి వివిధ స్ధాయి ఉద్యోగుల జీతాల్లో సీఎం కేసీఆర్ కోతలు విధించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ (కార్పొరేషన్) ల ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించారు.

 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ ఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లోనూ  60 శాతం కోత విధించారు. మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం (నాలుగో తరగతి మినహా) నాలుగో తరగతి, కాంట్రాక్టు, ఔట్  సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం వేతనాలకు కోత   విధించారు. 

అంతేకాక  అన్ని రకాల  రిటైర్డ్  ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం,నాలుగో తరగతి రిటైర్డ్  ఉద్యోగుల పింఛనులో 10 శాతం కోత విధిస్తారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు.  

Also Read | దడ పుట్టిస్తున్న ఢిల్లీ.. ఒక్కరోజే 25 కరోనా పాజిటివ్ కేసులు