ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం శనివారం(జనవరి 18,2020) సమావేశం అవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అయ్యే కేబినెట్ .. 3 రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. రాష్ఠ్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృధ్ధి పై జీఎన్ రావు నిపుణులు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కమిటీ నివేదిక అధ్యయనానికి ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం.. జనవరి 20 న కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే రెండు రోజులు ముందే కేబినెట్ భేటీ అవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా హైపవర్ కమిటీ సభ్యులు శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ ను కలిశారు. తమ నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
జనవరి 20 నుంచి 3 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం 20వ తేదీ ఉదయం కేబినెట్ భేటీ నిర్వహించాలని జగన్ అనుకున్నారు. కానీ రాజధాని అంశంపై తేల్చేందుకు రెండు రోజులు ముందే సమావేశం కానున్నారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానులుండే చాన్స్ ఉందని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ దిశగా మాట తప్పను.. మడమ తిప్పను అన్న లెవెల్‌లో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని అంశాన్ని వెల్లడించి ఆ వెంటనే ఆమోదం పొందేందుకు సిధ్దమవుతున్నారు.