ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 27 న విశాఖలో నిర్వహించే యోచనలో రాష్ట్ర పభుత్వం ఉంది. విశాఖలో కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈ కేబినెట్ భేటీలోనే ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.
ఏపీ రాజధాని అమరావతిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను ఈ భేటీలో ఓకే చేస్తారా లేక…వివిధ వర్గాలు… విపక్షాలు, అమరావతి రైతుల నుంచి ఎదురవతున్న వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా ? అనేది తేలాల్సి ఉంది. ఏదైనా డిసెంబర్ 27న జరిగే కేబినెట్ సమావేశం తర్వాత ఏపీ రాజధాని భవిష్యత్తు తేలిపోనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కేబినెట్ భేటీలోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
జీఎన్రావు కమిటీ రాజధానిపై పలుసూచనలు చేసిందని వాటిపై కేబినెట్ లో చర్చిస్తామని ఆయన తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అమరావతిలో భూములు అభివృద్ధి చేసి ఇస్తామని…ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బాబు మోసం చేస్తున్నారని, మోసపూరిత మాటలను నమ్మవద్దని బొత్స అమరావతి ప్రజలకు సూచించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ కొనసాగుతుందని బొత్స చెప్పారు.