జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 11:14 AM IST
జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు

Updated On : March 21, 2019 / 11:14 AM IST

విజయనగరం: జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ప్రజలు ప్రశాంతంగా బతకలేరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటాడని వార్నింగ్ ఇచ్చారు. నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ ను చూస్తే భయంతో పారిపోతాయని సీఎం చెప్పారు. సాలూరులో ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ పనికిమాలిన పార్టీ అని తిట్టారు. జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు అని హెచ్చరించారు. సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించే కుట్రలు చేశారని సీఎం ఆరోపించారు.
Read Also : YSCP లీడర్ కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో తనిఖీలు

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలపైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు తోడు కేసీఆర్.. వీరిద్దరికి మోడీ అండ అన్నారు. మన ఆస్తులు కొట్టేయడమే కాకుండా మళ్లీ మనపైనే కేసీఆర్ దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతో కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ది చేశానని చంద్రబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని మోడీ నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా, విభజన హామీలు అమలు చేయాలని పోరాడితే.. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీలతో దాడులు చేయించారని అన్నారు.

రైతులను ఆదుకుంటున్న, గిరిజనులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్ లో రూ.5కే భోజనం పెడుతున్నామన్నారు. మీ భవిష్యత్ నా భరోసా అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Read Also : ఏపీ ఎన్నికలు 2019 : పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ఛేంజ్